Site icon HashtagU Telugu

Care Hospital : అమెరికా సంస్థ చేతికి కేర్ హాస్పిటల్?

Care Hospital American Organization

Care

హైదరాబాద్‌ కేంద్రంగా, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వైద్య సేవలు అందిస్తున్న కేర్‌ హాస్పిటల్స్‌ (Care Hospital) యాజమాన్యం చేతులు మారనుంది ..!ఈ కార్పొరేట్‌ వైద్య సేవల సంస్థలో మెజార్టీ వాటాను టీపీజీ కేపిటల్‌ అనే ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ నుంచి కొనుగోలు చేయడానికి అమెరికా సంస్థ (American Organization) బ్లాక్‌స్టోన్‌ సిద్ధమవుతున్నట్లు మార్కెట్‌ వర్గాల్లో ప్రచారం అవుతోంది. అగ్రశ్రేణి ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడుల సంస్థల్లో బ్లాక్‌స్టోన్‌ ఒకటి. దీంతో పాటు సింగపూర్‌కు చెందిన తమసేక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సైతం కేర్‌ హాస్పిటల్స్‌ (Care Hospital)పై ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. కొనుగోలు కోసం ఎంతో కాలంగా సాగుతున్న సంప్రదింపులు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది.

అయితే ఇతర సంస్థలు పోటీ నుంచి తప్పుకున్నందున, టీపీజీ కేపిటల్‌ నుంచి కేర్‌ హాస్పిటల్స్‌లో మెజార్టీ వాటాను బ్లాక్‌స్టోన్‌ సొంతం చేసుకునే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఈ లావాదేవీ విలువ రూ.8,000 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఇది పూర్తయితే మనదేశంలో వైద్య సేవల రంగంలో చోటు చేసుకున్న అతిపెద్ద లావాదేవీల్లో ఒకటిగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి. కేర్‌ హాస్పిటల్స్‌లో వాటా విక్రయించేందుకు కొంతకాలంగా టీపీజీ కేపిటల్‌ ప్రయత్నిస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్ల ద్వారా, ఆసక్తి గల ఇన్వెస్టర్లతో మాట్లాడుతోంది. ఎట్టకేలకు ఈ వ్యవహారం పూర్తికానున్నట్లు తెలుస్తోంది.

కేర్‌ హాస్పిటల్స్‌, మనదేశంలోని అతిపెద్ద వైద్య సేవల సంస్థల్లో ఒకటి. పాతికేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సంస్థకు 6 రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో 16 ఆసుపత్రులున్నాయి. దాదాపు అన్ని స్పెషాలిటీ విభాగాల్లో వైద్య సేవలు అందిస్తోంది. 2020-21లో కేర్‌ హాస్పిటల్స్‌ (క్వాలిటీ కేర్‌ ఇండియా లిమిటెడ్‌) రూ.1,064 కోట్ల ఆదాయాన్ని, రూ.68 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం దాదాపు రూ.1750 కోట్లకు పెరిగినట్లు తెలుస్తోంది. బ్లాక్‌స్టోన్‌ గ్రూపు ఇటీవల కాలంలో ఆసియా దేశాల్లో అధికంగా పెట్టుబడులు పెడుతోంది. దీని కోసం 10 బిలియన్‌ డాలర్ల (రూ.82,000 కోట్ల)కు మించిన నిధిని సిద్ధం చేసుకుంది. మనదేశంలో వైద్య సేవల రంగంలో మంచి పెట్టుబడి అవకాశం కోసం కొంతకాలంగా అన్వేషిస్తున్నట్లు, అందులో భాగంగా కేర్‌ హాస్పిటల్స్‌పై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:  Haripriya : హీరోయిన్‌ హరిప్రియ నిశ్చితార్థం ఆ నటుడితోనే..