China: చైనా పై అమెరికా కొత్త ఆంక్షలు

ఇప్పటికే జిన్​జియాంగ్​లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు నిరసనగా బీజింగ్​లో జరిగే వింటర్ ఒలింపిక్స్​ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు అమెరికా గతవారమే ప్రకటించగా .. ఇప్పుడు చైనా పై కొత్త ఆంక్షలను తీసుకువచ్చింది.

  • Written By:
  • Publish Date - December 17, 2021 / 10:57 AM IST

చైనాకు అమెరికా మరో షాక్ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన బయోటెక్, నిఘా సంస్థలపై కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. జిన్​జియాంగ్ ప్రావిన్స్ లో ఉయ్​ఘర్​ ముస్లింలపై మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని అందుకే తాము ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇప్పటికే 2022బీజింగ్ ఒలంపిక్స్ ను దౌత్యపరంగా నిషేధించిన అమెరికా తాజాగా ఈ ఆంక్షలు విధించింది.

చైనా మిలిటరీకి అనుబంధ సంస్థ అయిన చైనా అకాడమీ ఆఫ్ మిలిటరీ సైన్సెస్​​, దాని 11 పరిశోధన సంస్థలు లక్ష్యంగా అమెరికా వాణిజ్య విభాగం ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఉయ్​ఘర్లను అణచివేసేందుకు జిన్​జియాంగ్ రాష్ట్రంలో చైనా ప్రత్యేక నిఘా పెట్టిందని అమెరికా ఆరోపించింది. బయోమెట్రిక్ ఫేస్​ రికగ్నిషన్​ ద్వారా 12 నుంచి 65 ఏళ్ల మధ్య వారి డీఎన్​ఏను సేకరిస్తున్నట్లు తమ నిఘా వర్గాల దృష్టికి వచ్చిందని.. అందుకే ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధికారిక వర్గాలు వివరించాయి. జిన్​జియాంగ్​ ప్రాంతంలోని ప్రజలతో చైనా బలవంతపు చాకిరీ చేయించుకుంటోందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జిన్​జియాంగ్​ రాష్ట్రం నుంచి తమ దేశానికి అన్ని దిగుమతులను నిషేధిస్తూ తీసుకొచ్చిన బిల్లుకు సెనేట్​ గురువారం ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ సంతకం చేయడం ఇక లాంఛనప్రాయమే.