1st Phase Of Gujarat: గుజరాత్‌లో ఫస్ట్ ఫేజ్‌ పోలింగ్‌కు అంతా రెడీ

గుజరాత్‌లో తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 89 స్థానాలకు మొత్తం 788మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 09:23 PM IST

గుజరాత్‌లో తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 89 స్థానాలకు మొత్తం 788మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, మాజీ మంత్రి పరుషోత్తమ్‌ సోలంకి, ఆప్‌ సీఎం అభ్యర్థి ఈశుదాన్ గఢ్వి, ఆప్ గుజరాత్ చీఫ్‌ గోపాల్ ఇటాలియా, మోర్బీ నుంచి కాంతిలాల్‌ అమృతియా, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఫస్ట్ ఫేజ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మోదీషా సొంత రాష్ట్రం గుజరాత్‌లో.. వరుసగా ఏడోసారి కాషాయ జెండా రెపరెపలాడించాలని ఉవ్విళూరుతోంది బీజేపీ. అభివృద్ధి అజెండాతో ప్రచారం హోరెత్తించింది. రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ర్యాలీలు, రోడ్‌షోలతో అదరగొట్టారు. టార్గెట్ 150 అంటూ ప్రచారపర్వాన్ని ముందుండి నడిపించారు ప్రధాని మోదీ. గుజరాత్ రూపకర్తను నేనే.. నన్ను చూసి బీజేపీకి ఓటేయండి అంటూ.. ఓవైపు సెంటిమెంట్‌ పండిస్తూనే.. మరోవైపు కాంగ్రెస్ వైఫల్యాలను కడిగిపారేశారు. వచ్చే 25ఏళ్ల ఉజ్వల భవిష్యత్ కోసం బీజేపీకి ఓటేయాలని ప్రధాని మోదీ గుజరాత్ ఓటర్లకు పిలుపునిచ్చారు .

27 ఏళ్లుగా అప్రతిహతంగా గుజరాత్‌ను ఏలుతున్న బీజేపీ.. ఈసారి రికార్డులపై కన్నేసింది. 150 సీట్లు నెగ్గి.. కాంగ్రెస్‌ సీఎం మాధవ్‌సిన్హ్ సోలంకి రికార్డును బద్దలుకొట్టాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అందుకే ఉచితాలకు వ్యతిరేకం అంటూనే గుజరాత్‌లో భారీగా ఎన్నికల హామీలిచ్చింది కాషాయదళం. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు, మహిళలకు లక్ష గవర్నమెంట్ జాబ్స్‌, అమ్మాయిలకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, మెరుగైన వైద్యం వంటి వాగ్దానాలు చేసింది. యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయడంతోపాటు రాష్ట్రంలో యాంటీ ర్యాడికల్ సెల్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది భారతీయ జనతా పార్టీ. ఇక గుజరాత్‌లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌.. ప్రచారంలో వెనుకబడింది. సీనియర్ నేత అహ్మద్ పటేల్ లోకపోవడం, రాహుల్ గాంధీ భారత్‌ జోడోపై ఫోకస్ పెట్టడం, హార్దిక్ పటేల్ వంటి యువనేతలు పార్టీని వీడడంతో.. గుజరాత్ కాంగ్రెస్‌లో ఎన్నికల జోష్ మిస్ అయ్యింది. రాజస్థాన్ మోడల్ అభివృద్ధి, 3 లక్షలవరకు రైతు రుణ మాఫీ.. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీలతో ప్రజల్లోకి వెళ్లింది హస్తం పార్టీ. 10లక్షల ఉద్యోగాలు.. యువతకు 3వేల నిరుద్యోగ భృతి, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ ఇవ్వనున్నట్టు మేనిఫెస్టోలో పేర్కొంది. గుజరాత్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైతే.. పాత పెన్షన్‌ పథకాన్ని పునరుద్ధరిస్తామని బలంగా ప్రచారం చేసింది. రెండు విడతలు గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాహుల్ గాంధీ. చివర్లో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే.. ప్రధాని మోదీని టార్గెట్ చేసి అగ్గి రాజేశారు.

పంజాబ్ తరహాలోనే గుజరాత్‌లోనూ పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ మోడల్ అభివృద్ధితోపాటు ఉచిత హామీలతో ఉద్ధృతంగా ప్రచారం నిర్వహించింది. రాజకీయాల్లో చేరిన జర్నలిస్ట్ ఈశుదాన్ గఢ్విని సీఎం అభ్యర్థిగా ప్రకటించి.. యువ ఓటర్లకు గాలం వేశారు కేజ్రీవాల్‌. 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీతో గుజరాత్ ఓటర్లను ఆకర్షించాలని భావిస్తోంది ఆప్‌. ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని.. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని హోరెత్తించింది. బీజేపీకి 27ఏళ్లు ఇచ్చారని.. ఆప్‌కు ఐదేళ్లు ఇవ్వాలని ఒక్క ఛాన్స్ అంటూ ఓటర్లను అభ్యర్థిస్తోంది. అయితే బీజేపీ గానీ, కాంగ్రెస్‌ గానీ గుజరాత్‌లో ఆప్‌ను ప్రధాన ప్రత్యర్థిగా చూడడం లేదు. త్రిముఖ పోరు ఉన్నప్పటికీ.. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే అసలు ఫైట్ అన్నట్టు ప్రకటనలు చేస్తున్నాయి రెండు పార్టీలు.

మోదీ నుంచి మోర్బీ వరకు.. అధిక ధరలు నుంచి నిరుద్యోగం వరకు.. బిల్కిస్ బానో కేసులో నేరస్థుల విడుదల నుంచి రైతులు,పాటిదార్‌ల సమస్యల వరకూ.. అనేక అంశాలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. రెండు దశాబ్దాలకుపైగా ఒకే పార్టీ పాలనలో ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకత కూడా కీలకమే. అయితే ప్రధాని మోదీ ఇమేజ్‌ గుజరాత్‌లో బీజేపీకి ప్రధాన అస్త్రం. ఇదే మరోసారి ఆ పార్టీని బలంగా నిలబెట్టనుంది. బీజేపీ నేతలే కాదు సర్వేలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. ఇప్పటివరకూ వచ్చిన అన్ని సర్వేలు గుజరాత్‌లో ఫిర్ ఏక్ బార్ బీజేపీ సర్కార్ అని తేల్చేశాయి. ఈసారి అధికార పార్టీకి 130-140 సీట్లు ఖాయమని అంచనా వేశాయి. ఎవరి లెక్కలు నిజమవుతాయో తెలియాలంటే డిసెంబర్ 8 వరకూ ఆగాల్సిందే.