Site icon HashtagU Telugu

Akhilesh Yadav: పోలీసులు ఇచ్చే టీలో విషం ఉందన్న అఖిలేష్ యాదవ్.. వీడియో వైరల్!

Akhilesh Yadav 3 Sixteen Nine

Akhilesh Yadav 3 Sixteen Nine

Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు టీ ఇస్తే తాగలేదు. ఆ టీలో విషం కలిపి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మీడియా వ్యవహారాలు పర్యవేక్షించడంతోపాటు, పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను నిర్వహించే మనీష్ జగన్ అగర్వాల్‌ను నేడు పోలీసులు అరెస్ట్ చేశారు.

మనీష్ అరెస్టును నిరసిస్తూ ఎస్పీ కార్యకర్తలు డీజీపీ కార్యాలయం వద్ద గుమికూడి నిరసనను తెలిపారు. ఆ నిరసనకు సంఘీభావం తెలుపడానికి అఖిలేష్ యాదవ్ తమ కార్యకర్తలతో కలిసి డీజీపీ ఆఫీసుకు చేరుకున్నారు. మనీష్ విడుదలపై పోలీసు ఉన్నతాధికారులతో అఖిలేష్ యాదవ్ చాలా సేపు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ కు అక్కడి పోలీసులు టీను ఇవ్వగా అది తాగేందుకు అఖిలేష్ నిరాకరించారు.

టీలో విషం కలిపారేమోనని, పోలీసులు ఇచ్చే టీ కాకుండా తన కార్యకర్తలు తీసుకొచ్చే టీనే తాను తాగుతానని తెలిపారు. ఆ తర్వాత తన కార్యకర్తలు తెచ్చిన టీని అఖిలేష్ యాదవ్ తాగారు. ప్రస్తుతం దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

సమాజ్ వాదీ పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణ నేపథ్యంలో మనీష్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా చాలా ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. మనీష్ పై అంతకుముందే మూడు ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదైనట్లు సమాచారం. ఇక అఖిలేష్ పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన టీని తాగకపోవడంతో పాటు అందులో విషం కలిపారని అనడం మరో చర్చకు దారి తీసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోకు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.