Akhilesh: జై హ‌నుమాన్ జై భీమ్.!

స‌మాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ ఈసారి ర‌థ‌యాత్ర‌ను న‌మ్ముకున్నాడు. హ‌నుమాన్ చిత్ర‌ప‌టాల‌ను ఎన్నిక‌ల చిహ్నానికి జోడిస్తున్నాడు. ఈ ప‌రిణామం హిందూ ఓటు బ్యాంకును అనుకూలంగా మార్చుకోవ‌డానికి ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నాడు.

  • Written By:
  • Updated On - December 30, 2021 / 05:44 PM IST

స‌మాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ ఈసారి ర‌థ‌యాత్ర‌ను న‌మ్ముకున్నాడు. హ‌నుమాన్ చిత్ర‌ప‌టాల‌ను ఎన్నిక‌ల చిహ్నానికి జోడిస్తున్నాడు. ఈ ప‌రిణామం హిందూ ఓటు బ్యాంకును అనుకూలంగా మార్చుకోవ‌డానికి ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నాడు. హిందూ, ముస్లిం, ద‌ళిత ఓట్ల కోసం అఖిలేష్ చేస్తోన్న ప్ర‌య‌త్నం వినూత్నంగా ఉంది. అంబేద్క‌ర్ విగ్ర‌హాల‌ను ద‌ళిత ఓట్ల కోసం న‌మ్ముకున్నాడు. హిందూ ఓట్ల కోసం హ‌నుమాన్ చిత్రపటాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నాడు.

ముస్లిం ఓటు బ్యాంకు స్వ‌త‌హాగా ఎస్పీ వైపు ఉంద‌ని భావిస్తున్నాడు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలను పెంచుకునేందుకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రథయాత్ర చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో రథయాత్రకు ప్రత్యేక రాజకీయ ప్రాధాన్యత ఉంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రముఖ నాయకుడు ఎల్‌కె అద్వానీ రథయాత్ర ద్వారా 1990ల ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లో పార్టీ అధికారంలోకి వచ్చింది. యూపీలోని ఉన్నావ్ ప్రాంతంలో అఖిలేష్ రథయాత్రకు భారీ సంఖ్యలో జనం వచ్చారు. కార్యకర్తలు, మద్దతుదారుల నుండి బహుమతులు స్వీకరించారు. వాటిలో హనుమంతుడి ఫోటో ఒకటి ఉంది. హనుమంతుని ఫోటో సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల చిహ్నంతో రూపొందించబడింది. దాన్ని అఖిలేష్ కు బ‌హుమ‌తిగా ఇవ్వ‌గా రెండు చేతులతో హనుమంతుని చిత్రపటాన్ని పట్టుకుని ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించాడు.

మరొక ఛాయాచిత్రంలో హనుమంతుని ప్రఖ్యాత ఆయుధమైన గదను పట్టుకుని ఉన్నాడు. తన ఎడమ చేతిలో గద‌ పట్టుకొని ఉన్నావ్ ప్రాంతంలో జ‌రిగిన ర‌థ‌యాత్ర‌లో అభివాదం చేస్తూ అఖిలేష్ యాదవ్ ముందుకు క‌దిలాడు. భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ చిన్న విగ్ర‌హాన్ని ఆ యాత్ర‌లోనే మ‌ద్ద‌తుదారుల నుంచి స్వీక‌రించాడు. ఒక వైపు హ‌నుమాన్ ఇంకో వైపు అంబేద్క‌ర్ చిత్ర ప‌టాల‌తో హిందూ, ద‌ళిత వ‌ర్గాల‌ను ఆకర్షించేలా అఖిలేష్ యాత్ర‌ను చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.