AI Spam Detection : మన ఫోన్లకు స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజ్‌లు పెద్దఎత్తున వస్తుంటాయి. వీటిని చూడలేక అందరూ విస్మయానికి గురవుతుంటారు. ఈ సమస్యపై ఇటీవలే మనదేశ టెలికాం నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ కీలక ఆదేశాలు ఇచ్చింది. యూజర్లకు స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వెళ్లకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత టెలికాం కంపెనీలపై ఉందని ట్రాయ్ పేర్కొంది. ఈవిషయంలో టెలికాం కంపెనీలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని నిర్దేశించింది. ఈనేపథ్యంలో భారతీ ఎయిర్ టెల్ కీలక ప్రకటన చేసింది. స్పామ్ కాల్స్, మెసేజ్‌లను అడ్డుకునే ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. దాన్ని తమ యూజర్లకు ఫ్రీగా అందిస్తామని తెలిపింది. రేపటి (సెప్టెంబరు 26) నుంచి ఎయిర్ టెల్ యూజర్లు అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా స్పామ్ కాల్స్, మెసేజ్‌లపై చర్యలు తీసుకుంటున్న తొలి టెలికాం నెట్‌వర్క్ తమదే అని ఎయిర్ టెల్(AI Spam Detection) వెల్లడించింది.
Also Read :CM Siddaramaiah : ‘ముడా’ స్కాం.. సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త విచారణకు కోర్టు ఆదేశం
స్పామ్ కాల్స్, మెసేజ్‌ల వల్ల కొందరు ప్రజలు మోసపోతున్నారని, అలాంటి మోసాలకు ఇక తావు ఉండదని ఎయిర్ టెల్ పేర్కొంది. తమ ఏఐ స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్ 2 మిల్లీ సెకన్లలోనే స్పామ్ కాల్, మెసేజ్‌ను గుర్తించి యూజర్‌కు డయలర్‌పై అలర్ట్ జారీ చేస్తుందని వెల్లడించింది. ఏఐ ఆధారిత సొల్యూషన్ ద్వారా తాము ఒక రోజులో 250 కోట్ల కాల్స్‌ను, 150 కోట్ల మెసేజ్‌లను ఒక్కోదాన్ని సగటున 2 మిల్లీ సెకన్లలో ప్రాసెస్ చేస్తామన్నారు. ప్రతిరోజూ స్పామ్ అవకాశమున్న 10 కోట్ల కాల్స్‌ను, 30 లక్షల మెసేజ్‌లను తమ కొత్త టెక్నాలజీ గుర్తించగలదని ఎయిర్ టెల్ తెలిపింది. అయితే ఇది స్పామ్ కాల్స్, మెసేజ్‌లను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయదని తెలిపింది. దాన్ని బ్లాక్ చేసే విషయంపై యూజర్లే నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ టెల్ వివరించింది. కొన్నిసార్లు పొరపాటున నిజమైన కాల్స్ కూడా స్పామ్‌గా గుర్తించబడే ముప్పు ఉందని, అందుకే వాటిని ఆటో బ్లాక్ చేయడం లేదని తెలిపింది.