Plane Door Horror : అమెరికాలో అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ‘బోయింగ్ 737-9 మ్యాక్స్’ విమానం టేకాఫ్ అయిన వెంటనే దాని కిటికీ ఊడిపోయిన ఘటన అందరినీ నివ్వెరపరిచింది. ఈ ఘటనతో విమానాలను ప్రయాణం కోసం సిద్ధం చేసేముందు.. వాటికి కనీస తనిఖీలు చేయడం లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి.దీంతో మన దేశంలోని బోయింగ్‌కు చెందిన 737-8 మ్యాక్స్ విమానాల్లో తనిఖీలు చేపట్టాలని భారత విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్‌కు చెందిన 737-8 మ్యాక్స్ విమానాల్లో తనిఖీలు నిర్వహించాలని నిర్దేశించింది. భారత్‌లోని ఏ విమానయాన సంస్థ కూడా ‘బోయింగ్ 737-9 మ్యాక్స్’ విమానాలను వినియోగించడం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా మన దేశంలో వినియోగంలో ఉన్న బోయింగ్ 737-8 మ్యాక్స్ విమానాల్లో అత్యవసరంగా తనిఖీలు చేయాలని కోరింది.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా అలర్ట్ అయింది. బోయింగ్ 737 MAX 9 విమాన సర్వీసులను వినియోగించే ముందు పూర్తిస్థాయి తనిఖీలు చేయాలని ఆదేశించింది. ఈ తనిఖీల వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 171 ‘బోయింగ్ 737 MAX 9’ విమాన సర్వీసులు కొంత ప్రభావితమవుతాయని తెలిపింది. ఒక్కో విమానం తనిఖీకి నాలుగు నుంచి ఎనిమిది గంటల టైం పడుతుందని వెల్లడించింది. ప్రయాణికుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. ఇక కిటికీ ఊడిపోయిన ఘటనను ఎదుర్కొన్న అలస్కా ఎయిర్‌లైన్స్ కూడా బోయింగ్ 737-9 మోడల్‌కు చెందిన 65 విమానాలను ఎయిర్‌పోర్టులకే పరిమితం చేసింది. ప్రస్తుతం తనిఖీలు(Plane Door Horror) చేస్తోంది.
Also Read: Uber Flex : ‘ఉబెర్ ఫ్లెక్స్’.. మీ రైడ్ ధరను మీరే డిసైడ్ చేసుకోవచ్చు
అమెరికాలోని పోర్ట్‌లాండ్ నుంచి ఒంటారియోకు బయలుదేరిన బోయింగ్ విమానం టేకాఫ్ అయిన తర్వాత 16 వేల అడుగుల ఎత్తులో ఉండగా..దానిలోని ఒక డోర్ ఊడిపడిపోయింది. దాంతో విమానం అత్యవసరంగా దిగింది. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సుక్షితంగా బయటపడటం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ముందు విమానంలో పీడన సంబంధిత సమస్య తలెత్తిందని సిబ్బంది తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుపుతామని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(FAA) ప్రకటించింది. ఈ విమానాన్ని అక్టోబర్‌లో అలస్కా సంస్థకు డెలివరీ చేశారు. నవంబర్‌లో ధ్రువీకరణ లభించిందని ఎఫ్‌ఏఏ డేటాతో తెలుస్తోంది. ఈ ఘటనపై బోయింగ్ సంస్థ కూడా స్పందించింది. ‘దీనిపై కస్టమర్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం. మా టెక్నికల్ టీమ్ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉంది’ అని వెల్లడించింది.