Site icon HashtagU Telugu

Air Pollution: కాలుష్యంతో దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరి..!

Delhi Air Pollution

Delhi Air Pollution

దేశ రాజధాని కాలుష్య కోరల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ భారీగా పతనం కావడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో కాలుష్య నియంత్రణకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది ఢిల్లీ సర్కార్‌. ప్రైమరీ స్కూల్స్‌ను మూసివేయాలని ఆదేశాలిచ్చింది. ఐదు, ఆపై తరగతుల విద్యార్థులకు అవుట్‌ డోర్ ఈవెంట్స్‌, గేమ్స్‌ రద్దు చేసింది. నోయిడాలో 8వ తరగతి వరకూ స్కూల్స్‌ మూసేయాలని ఆదేశాలిచ్చారు అధికారులు.

ఢిల్లీ NCR పరిధిలో ఎయిర్ క్వాలిటీ ఇండెన్స్ 600 మార్క్ క్రాస్ చేయడంతో.. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు సీఎం కేజ్రీవాల్‌. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ నాలుగో దశ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రైవేటు సంస్థలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని సూచించింది ఆప్ సర్కార్‌. ఆఫీసులు, మార్కెట్ల పని వేళలను కుదించడంతోపాటు వాహనాలకు సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది.

సరిహద్దు రాష్ట్రాల్లో పెద్దఎత్తున పంట వ్యర్థాల దహనం చేస్తుండడంతో.. ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌లా మారిపోయింది. దట్టమైన పొగ రాజధాని పరిసర ప్రాంతాలను కమ్మేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది బీజేపీ. దీనిపై స్పందించిన కేజ్రీవాల్‌.. పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనానికి పూర్తి బాధ్యత తమదే అన్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ సమస్యకు పూర్తి పరిష్కారం కనుగొంటామని తెలిపారు. ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నెల 10న దీనిని విచారించనుంది సర్వోన్నత న్యాయస్థానం. పంట వ్యర్థాల దహనాన్ని నియంత్రించేలా.. ఢిల్లీ, పంజాబ్‌, హరియాణా, యూపీ ప్రభుత్వాలను కఠిన ఆదేశాలివ్వాలంటూ అడ్వకేట్‌ శశాంక్ శేఖర్ ఝా ఈ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఢిల్లీ కాలుష్యంపై సీరియస్ అయిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌.. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ సీఎస్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

Exit mobile version