Air India : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం సాయంత్రం ఒక భయానక ఘటన చోటుచేసుకుంది. హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం (AI-315) ల్యాండింగ్ అయ్యి పార్క్ చేసిన కొద్ది సేపటికే విమానంలోని ఆక్సిలరీ పవర్ యూనిట్ (APU) లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు, సిబ్బంది భయాందోళనకు గురైనప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఎయిర్ ఇండియా ప్రకటించింది.
ఘటన ఎలా జరిగింది?
జూలై 22న AI-315 విమానం హాంకాంగ్ నుండి ఢిల్లీకి సురక్షితంగా ల్యాండింగ్ అయింది. ప్రయాణికులు విమానం దిగుతున్న సమయంలోనే వెనుక భాగంలో ఉన్న APUలో అగ్ని చెలరేగింది. అయితే విమాన భద్రతా వ్యవస్థలు వెంటనే స్పందించి APUని ఆటోమేటిక్‌గా ఆపేసి, మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ సమయంలో ఎవరికి గాయాలు కానట్లు అధికారులు వెల్లడించారు.
YCP : నెక్స్ట్ అరెస్ట్ అనిల్ కుమార్ యాదవేనా..? అక్రమ మైనింగ్ ఉచ్చు బిగిస్తుందా..?
ఏమంటున్న ఎయిర్ ఇండియా?
విమానంలోని APUలో ఏర్పడిన మంటను చిన్నచూపు చూడలేమని, పూర్తిస్థాయి తనిఖీ పూర్తయ్యే వరకు ఆ ఎయిర్‌బస్ A321 విమానాన్ని గ్రౌండ్ చేశామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. అలాగే ఈ ఘటనపై DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)కి సమాచారం అందించామని పేర్కొంది.
ఇటీవలి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి
గత 48 గంటల్లో ఎయిర్ ఇండియాకు చెందిన మరో రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి. కోచి-ముంబై విమానం ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి త్రోసుకుపోయింది. ఢిల్లీ-కొల్కతా విమానం టేకాఫ్ ముందు సాంకేతిక సమస్యల కారణంగా హఠాత్తుగా నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పుడీ AI-315 APU మంట ఘటనతో ఎయిర్ ఇండియా భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భవిష్యత్తులో జాగ్రత్తలు
ఎయిర్ ఇండియా తెలిపిన ప్రకారం, ఈ సంఘటనపై సాంకేతిక నిపుణులు పూర్తి స్థాయి తనిఖీలు చేపడుతున్నారు. APU డిజైన్ లోపాలా? లేక మరేదైనా సాంకేతిక కారణమా అన్నది కనుగొనడానికి పరిశోధన కొనసాగుతోంది.
గత నెలలో జరిగిన ఘోర ప్రమాదం గుర్తు
ఇటీవలే జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన AI-171 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ప్రమాదంలో 260 మంది మరణించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుండగా, ఎయిర్ ఇండియాలో సాంకేతిక, ఆపరేషనల్ అంశాలపై కఠిన పరిశీలన అవసరమని విమాన నిపుణులు సూచిస్తున్నారు.
New Wing : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త శాఖ ఏర్పాటు..!