Air India : అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితుల కుటుంబాలకు మధ్యంతర నష్టపరిహారం చెల్లించే ప్రక్రియలో తమపై వస్తున్న ఆరోపణలను ఎయిర్ ఇండియా ఖండించింది. కుటుంబాలను బలవంతంగా ఒప్పిస్తున్నామని వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని, సంబంధిత నిబంధనలు పాటిస్తూ బాధిత కుటుంబాలకు సాయం అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే దారిలో ఏఐ 171 విమానం కూలిన ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధితులకు మధ్యంతర పరిహారం చెల్లించే ప్రక్రియలో భాగంగా, “స్టీవార్ట్స్” అనే యూకే న్యాయ సంస్థ ఎయిర్ ఇండియా తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫారాలపై బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారని, చట్టపరంగా స్పష్టత లేకుండా ఒత్తిడి చేస్తోందని సంస్థ భాగస్వామి పీటర్ నీనన్ ఆరోపించారు.
దీనిపై స్పందించిన ఎయిర్ ఇండియా, “ప్రశ్నాపత్రం ద్వారా కేవలం కుటుంబ సభ్యుల వివరాలను ధృవీకరించడమే మా ఉద్దేశం. ఎవరిని బలవంతం చేయడం జరగలేదు. ఎవరైనా నేరుగా లేదా ఈమెయిల్ ద్వారా ఫారాలు సమర్పించవచ్చు. వారి ఇంటికి వెళ్లి ఒత్తిడి చేసినట్టు ఆరోపణలు అవాస్తవం” అని స్పష్టం చేసింది. అంత్యక్రియలు, వసతి వంటి ఏర్పాట్ల కోసం ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్టు వివరించింది.
ఇప్పటికే 47 కుటుంబాలకు మధ్యంతర పరిహారం అందజేశామని, 55 కుటుంబాల పత్రాలు పరిశీలనలో ఉన్నాయని ఎయిర్ ఇండియా పేర్కొంది. అదే సమయంలో, టాటా గ్రూప్ కూడా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున అదనపు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. దీర్ఘకాలికంగా మద్దతు అందించేందుకు రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటుచేసినట్టు ప్రకటించింది.
ఇక న్యాయవాదులు మాత్రం ఈ పరిహార ప్రక్రియపై నిగ్రహం చూపాలని కోరుతున్నారు. ప్రస్తుతం అందిస్తున్న ఫారాల ద్వారా భవిష్యత్తులో కంపెనీ తక్కువ నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉందన్న అనుమానంతో, తమ క్లయింట్లను వాటిపై సంతకాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలతో వివాదం ఇంకా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Accident : మహబూబాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం