TATA : అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన దురదృష్టకర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో, టాటా సన్స్ , ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు.
“ఇది చాలా బాధాకరమైన ఘటన. ఎయిరిండియా వంటి సంస్థలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు అండగా నిలబడతామని హామీ ఇస్తున్నాం. వారికి అవసరమైన అన్ని విధాల సహాయం అందించేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది” అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
గత గురువారం లండన్‌కు బయల్దేరిన డ్రీమ్‌లైనర్ విమానం ఏఐ171 టేకాఫ్ అయిన కొద్ది సమయానికే ఒక్కసారిగా అదుపు తప్పి అహ్మదాబాద్‌లోని ఒక భవనంపై కూలిపోయింది. ఈ ప్రమాదం మానవ తప్పిదం, సాంకేతిక లోపం లేదా మరేదైనా కారణంతో జరిగిందా అనే విషయంపై డీజీసీఏ ప్రత్యేక విచారణ చేపట్టింది.
ఈ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని చంద్రశేఖరన్ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు పూర్తవడానికి కనీసం ఒక నెల సమయం పట్టవచ్చని అంచనా వేసారు. విమానంలో ఏవైనా సాంకేతిక లోపాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా సమీక్షిస్తున్నామని తెలిపారు. అంతేగాక, ప్రమాదానికి గురైన విమానం గతంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదని తెలిపారు. “కుడివైపు ఇంజిన్‌ను మార్చి మూడు నెలలే అయింది. ఎడమవైపు ఇంజిన్‌కు గత నిర్వహణ 2023 జూన్‌లో జరిగిందని, తదుపరి మేంటెనెన్స్ 2025 డిసెంబర్లో జరగాల్సి ఉంది” అని ఆయన వివరించారు.
విమానాన్ని నడిపిన పైలెట్లు అత్యంత అనుభవజ్ఞులని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. కెప్టెన్ సభర్వాల్‌కు 11,500 గంటల పైగా, కోపైలట్ కుందర్‌కు 3,400 గంటల పైగా విమానయాన అనుభవం ఉందన్నారు. “ప్రస్తుతం ఈ ఘటనకు గల కారణం ఏంటన్న దానిపై స్పష్టత లేదు. బ్లాక్ బాక్స్ డేటా, ఇతర రికార్డర్ల విశ్లేషణ తర్వాతే నిజమైన కారణాలు వెలుగులోకి వస్తాయి. అప్పటివరకు ఊహాగానాలతో ముందుకు పోకూడదు” అని చంద్రశేఖరన్ అన్నారు.
Auto Tips : మీ పాత కారును అమ్మే బదులు, దానిని స్క్రాప్‌కు ఇచ్చి లాభం పొందండి.. ఎలా..?