Delhi Polls : 2025 సంవత్సరం ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ పార్టీ ఫోకస్ పెట్టింది. అక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న పలు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఒవైసీ భావిస్తున్నారు. ఈక్రమంలోనే మజ్లిస్ పార్టీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ షోయబ్ జమాయి ఓ కీలక వ్యక్తితో భేటీ అయ్యారు. 2020 సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన మతపరమైన అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న షారుఖ్ పఠాన్ కుటుంబీకులతో ఆయన సమావేశమయ్యారు. ఢిల్లీ అల్లర్ల సమయంలో ఓ పోలీసు సిబ్బందిపైకి తుపాకీని షారుఖ్ పఠాన్(Delhi Polls) గురిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి అప్పట్లో వైరల్ అయింది. ఈ కేసులో ప్రస్తుతం షారుఖ్ తిహార్ జైలులో ఉన్నాడు.
Also Read :Bus Falls Into Gorge : 1500 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిన బస్సు.. ఏమైందంటే..
షారుఖ్ కుటుంబ సభ్యులతో డాక్టర్ షోయబ్ జమాయి ఏం చర్చించారు ? అసెంబ్లీ ఎన్నికల్లో వారి కుటుంబం నుంచి ఎవరికైనా మజ్లిస్ పార్టీ టికెట్ ఇస్తారా ? అనే కోణంలో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. షారుఖ్ పఠాన్ కుటుంబం ప్రస్తుతం ఢిల్లీలోని సీలం పూర్ అసెంబ్లీ స్థానం పరిధిలో నివసిస్తోంది. ఈ అంశంపై ఢిల్లీ మజ్లిస్ చీఫ్ డాక్టర్ షోయబ్ జమాయి స్పందిస్తూ.. ‘‘రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. సీలంపూర్ అసెంబ్లీ స్థానంలో ముస్లిం మైనారిటీలు ఎక్కువ. అక్కడి ప్రజలకు మంచి నాయకుడు కావాలి. షారుఖ్ పఠాన్‌కు అసెంబ్లీ టికెట్ కేటాయింపుపై మా పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుంది’’ అని వెల్లడించారు.
Also Read :Childhoods Chained : కాళ్ల కడియాలు కాదు.. ఆడపిల్లల జీవితాలకు సంకెళ్లు.. ఆ ఊరిలో పుట్టకముందే నిశ్చితార్ధాలు
‘‘షారుఖ్ పఠాన్ విషయంలో అన్యాయం జరుగుతోంది. అతడి కేసులో సరైన విచారణ జరగడం లేదు. అభియోగాలకు తగిన ఆధారాలు లేకున్నా.. షారుఖ్‌ను ఏళ్లతరబడి జైల్లో పెట్టడం బాధాకరం. అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలతోనే షారుఖ్‌పై కేసు నమోదైందని.. అతడి తల్లి నాతో చెప్పారు. ఈవిషయాన్ని షారుఖ్ కూడా మర్చిపోలేడు’’ అని డాక్టర్ షోయబ్ జమాయి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. అయితే షారుఖ్ పఠాన్ కుటుంబీకులతో ఢిల్లీ మజ్లిస్ చీఫ్ భేటీ కావడంపై ఢిల్లీకి చెందిన బీజేపీ సీనియర్ నేత విజేందర్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు మజ్లిస్ పార్టీ యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఢిల్లీని ముక్కలు చేయాలనే తప్పుడు ఉద్దేశం మాత్రమే మజ్లిస్ పార్టీ చర్యల్లో కనిపిస్తోందన్నారు.