Afzal Gurus Brother: అఫ్జల్ గురు.. 2001 డిసెంబరులో మన దేశ పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడికి సూత్రధారి. అతడిని దోషిగా తేల్చిన భారత సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. 2013 ఫిబ్రవరి 9న అతడిని తిహార్ జైలులో ఉరితీశారు. కట్ చేస్తే.. అఫ్జల్ గురు సోదరుడు ఐజాజ్ అహ్మద్ గురు భవితవ్యం ఇవాళ తేలనుంది. అయితే అతడు జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో కశ్మీర్‌లోని సోపోర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాాడు. సోపోర్ స్థానంలో టఫ్ ఫైట్ నెలకొంది. ఎందుకంటే ఇక్కడి నుంచి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ రషీద్ దార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఇర్షాద్ రసూల్‌కర్ బరిలో ఉన్నారు. వీరిని ఎంతేమరకు ఐజాజ్ అహ్మద్ గురు ఢీకొనగలరు అనేది ఇంకొన్ని గంటల్లోనే తేలిపోతుంది.
Also Read :Elections 2024 : జమ్మూకశ్మీర్, హర్యానాలలో కాంగ్రెస్ లీడ్.. బీజేపీ వెనుకంజ
ఐజాజ్ అహ్మద్ గురూ విషయానికొస్తే.. ఆయన ప్రజా సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడతానని ఆయన అంటున్నారు. తన సోదరుడు అఫ్జల్ గురు పేరుతో ఎన్నికల ప్రచారం చేయలేదని ఆయన తేల్చి చెప్పారు. కేవలం కశ్మీర్ డెవలప్మెంట్ అనే ఎజెండాతో తాను ప్రజలను కలిసి ఓట్లు అడిగానని తెలిపారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిస్తే సోపోర్ (Afzal Gurus Brother) అసెంబ్లీ స్థానంలోని ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని ఐజాజ్ అహ్మద్ గురూ పేర్కొన్నారు. ఈయన 2014 సంవత్సరం దాకా జమ్మూకశ్మీర్ పశుసంవర్ధక శాఖలో పనిచేశారు. ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని ప్రస్తుతం కాంట్రాక్టర్‌గా మారారు. సోపోర్ అసెంబ్లీ స్థానం పరిధిలో కాంట్రాక్టు పనులను చేస్తున్నారు. సోపోర్ అసెంబ్లీ స్థానం యాపిల్ తోటలకు పెట్టింది పేరు. 1990వ దశకానికి ముందు వరకు ఇది మంచి టూరిస్టు స్పాట్. వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ గిలానీ ఇక్కడి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008లో సోపోర్‌లో కేవలం 19 శాతం మంది ఓటింగ్ జరిగింది. 2014లో ఇక్కడ 30 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇక్కడ ఇదే విధమైన ఓటింగ్ ట్రెండ్ కనిపించింది.