DK Shivakumar: బెంగళూరు ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. గత మూడేళ్లలో 6,000కు పైగా డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు అయ్యాయి

DK Shivakumar: నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. గత మూడేళ్లలో 6,000కు పైగా డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు అయ్యాయి. ఎన్‌సిఆర్‌బి డేటా ప్రకారం ద్విచక్ర వాహనాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.

డ్రైవింగ్ చేసేటప్పుడు ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదని అన్నారు.జీవితం విలువైనది. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. ఫుట్‌పాత్ రైడింగ్ మరియు సిగ్నల్ జంపింగ్‌ల ద్వారా ప్రమాదం పొంచి ఉన్నదని, దయచేసి ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీదేనని యువతను కోరారు. అదే సమయంలో రహదారి భద్రత గురించి విద్యను అందించాల్సిన అవసరాన్ని డీకే నొక్కి చెప్పారు.

ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సీఎం సాంత్వన హరీశ్‌ పథకాన్ని ప్రవేశపెట్టామని ఉపముఖ్యమంత్రి తెలిపారు. బెంగళూరు జనాభా వేగంగా పెరుగుతోంది. వాహనాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. బీబీఎంపీ, పోలీసు శాఖ, రవాణా శాఖ సహకారంతో నగరంలో ట్రాఫిక్‌ను సులభతరం చేసేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నాం. ఇతర దేశాల ట్రాఫిక్ నిర్వహణ నమూనాలను కూడా అధ్యయనం చేస్తున్నామని డీకే చెప్పారు. కాగా వీధి వ్యాపారుల తొలగింపుపై ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకే ఈ తొలగింపులు జరుగుతున్నాయన్నారు.

ఫుట్‌పాత్‌లు పాదచారుల కోసం ఏర్పాటు చేశారు. వీధి వ్యాపారులు వాటిని వినియోగించుకుంటే ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. వీధి వ్యాపారులు తగిన ప్రదేశంలో వ్యాపారం చేయడానికి అనుమతి ఇస్తామన్నారు. అలాగే వారికి ఆర్థిక సహాయం అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని డీకే అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ కర్ణాటక లేదా తెలంగాణ నుంచి పోటీ చేసే ఆలోచన చేస్తారా అని అడిగిన ప్రశ్నకు నా వద్ద ఎలాంటి సమాచారం లేదు, దాని గురించి ఎవరూ నాతో మాట్లాడలేదని అన్నారు.

Also Read: CM Revanth: తెలంగాణకు నూతన పారిశ్రామిక కారిడార్స్ ప్లీజ్, పీయూష్ కు రేవంత్ విజ్ఞ‌ప్తి