Vijay Rupani: గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో జూన్ 12న జరిగిన విమాన ప్రమాదం మళ్లీ ఒక్కసారి దుఃఖాన్ని మిగిల్చింది. ఈ ఘోర ఘటనలో మృతి చెందిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ రూపాణీ ఉన్నట్లు అధికారికంగా ధృవీకరించబడింది. గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదం జరిగిన మూడురోజుల తర్వాత డీఎన్‌ఏ పరీక్షల ద్వారా రూపాణీ మృతదేహాన్ని గుర్తించినట్లు ఆయన తెలిపారు. రూపాణీ కుటుంబసభ్యుల జన్యు నమూనాల తో పోల్చిన డీఎన్‌ఏ విశ్లేషణ ఫలితాల్లో ఈ విషయం స్పష్టమైందన్నారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని కుటుంబానికి అప్పగించినట్లు చెప్పారు.
ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 32 మృతుల డీఎన్‌ఏ నమూనాలు వారి కుటుంబాల నమూనాలతో సరిపోలినట్లు బీజే వైద్య కళాశాల వైద్యులు తెలిపారు. వీరిలో 14 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. డీఎన్‌ఏ పరీక్ష అవసరం లేకుండా బంధువులు గుర్తించిన 8 మృతదేహాలను ఇప్పటికే అప్పగించినట్లు వెల్లడించారు. ప్రమాద తీవ్రత కారణంగా పలువురు మరణించినవారిని శరీరాలను గుర్తించడానికి పెద్ద కష్టాలు ఎదురవుతున్నాయి. కాలిన శరీరాలను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు తప్పదని వైద్యులు చెబుతున్నారు. ఒక్కో పరీక్ష పూర్తయ్యేందుకు సమయం ఎక్కువగా పడుతుండటంతో ఈ ప్రక్రియకు ఆలస్యం అవుతోంది.
ప్రస్తుతం బాధితుల కుటుంబాలకు సమాచారాన్ని అందించేందుకు 230 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన 11 మంది విదేశీయుల కుటుంబాలతో కూడా సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.