గజూన్ 12న అహ్మదాబాద్ (Ahmedabad ) విమానాశ్రయం వద్ద జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాదం దేశాన్ని తలకిందుల చేసింది. లండన్ గ్యాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరిన ఈ విమానం భయానక రీతిలో కుప్పకూలింది. ఫ్లైట్‌లో ఉన్న 241 మంది ప్రయాణికులతో పాటు బీజే మెడికల్ కాలేజ్‌కు చెందిన 33 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 274కి చేరింది. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 మంది పోర్చుగీసు దేశస్థులు, ఒక కెనడియన్ ఉన్నారు. ఈ ఘటన చాలా కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. మెడికల్ కాలేజ్‌కు చెందిన 24 మంది విద్యార్థులు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మిగతా 9 మంది చికిత్స పొందుతూ మరణించారు. క్షతగాత్రులు ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన తరువాత బోయింగ్ విమానాల భద్రతపై తీవ్రంగా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో ఇదొక ఘోరమైన ప్రమాదంగా నమోదైంది. ఎయిర్ ఇండియా చరిత్రలో ఇది రెండవ అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. విమాన ప్రమాదంపై కారణాలను తెలుసుకునేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ హై లెవెల్ మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించడంతో పాటు ప్రస్తుతం అమలులో ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPలు), మార్గదర్శకాలను సమీక్షించనుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నివారించేందుకు సమగ్ర SOPలు రూపొందించేందుకు ఈ కమిటీ సూచనలు ఇవ్వనుంది. ఇది ఇతర సంస్థలు చేపట్టే విచారణలకు ప్రత్యామ్నాయంగా కాకుండా, భద్రతా ప్రమాణాల మెరుగుదలకే ముఖ్యంగా పనిచేయనుంది.