KCR : ఢిల్లీలో కేసీఆర్ హోర్డింగ్..తొల‌గింపు మ‌ర్మం!

`దేశ్ కీ నేత కేసీఆర్‌` అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ హోర్డింగ్ ఢిల్లీ రోడ్ల ప‌క్క‌న క‌నిపించింది. సోష‌ల్ మీడియాలో అందుకు సంబంధించిన పోస్ట్ చూడ‌గానే ఏమైందో, తెలియ‌దుగాని వెంట‌నే దాన్ని తొలిగించారు.

  • Written By:
  • Updated On - June 16, 2022 / 03:51 PM IST

`దేశ్ కీ నేత కేసీఆర్‌` అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ హోర్డింగ్ ఢిల్లీ రోడ్ల ప‌క్క‌న క‌నిపించింది. సోష‌ల్ మీడియాలో అందుకు సంబంధించిన పోస్ట్ చూడ‌గానే ఏమైందో, తెలియ‌దుగాని వెంట‌నే దాన్ని తొలిగించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో విప‌క్ష నేతల స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ స‌మావేశానికి కేసీఆర్ కూడా హాజ‌రవుతార‌ని భావించిన ఆయ‌న అభిమానులు హోర్డింగ్ ల‌ను పెట్టారు. మమత లేఖను వైసీపీ పట్టించుకోకపోగా, టీఆర్ఎస్ మాత్రం తాము రాబోమని తేల్చి చెప్పింది. దేశానికి ప్ర‌త్యామ్నాయ ఎజెండా కావాల‌ని ముందుకెళుతోన్న కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీకి స‌మ‌దూరంలో ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకే, ఆయ‌న మ‌మ‌త ఆహ్వానాన్ని సున్నితంగా తిర‌స్క‌రించారు. ఆ సంగ‌తి తెలుసుకున్న అభిమానులు హోర్డింగ్ ల‌ను తొల‌గించార‌ని ఢిల్లీ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతోంది.

కేసీఆర్ కానీ, ఆ పార్టీ ప్రతినిధులు కానీ ఈ సమావేశానికి హాజరు కాకున్నా దేశ రాజధానిలో కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ భారీ హోర్డింగ్ ఏర్పాటు చేయడం విశేషం. ప్రతిపక్షాలు సమావేశమైన కానిస్టిట్యూషన్ క్లబ్ ఎదుట ఏర్పాటు చేసిన ఈ హోర్డింగులో.. ‘దేశ్‌ కా నేత కేసీఆర్ ఢిల్లీకి హృదయపూర్వక స్వాగతం. తెలంగాణ వికాస పురుషుడు, విఖ్యాత కేసీఆర్ దేశానికి కొత్త దిశను ఇచ్చేందుకు వస్తున్నారు. భారతీయ రాష్ట్ర సమితి పార్టీతో కేసీఆర్ దేశ ప్రజలను ఉత్థాన స్థితికి తీసుకెళ్తారు’ అని రాసివుంది. అయితే, ఆ తర్వాత కాసేపటికే ఆ హోర్డింగును తొలగించారు. ఈ హోర్డింగును ఎవరు ఏర్పాటు చేశారు? ఎందుకు తీసేశారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరినోళ్ల‌లోనూ నానుతోంది.