Site icon HashtagU Telugu

Goa Assembly Election 2022: గోవాలో రిసార్ట్ రాజ‌కీయాలు షురూ చేసిన కాంగ్రెస్..!

Congress Resort Politics In Goa

Congress Resort Politics In Goa

ఇండియాలో ఇటీవ‌ల ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు విడుద‌ల వారీగా మార్చి 7 వ‌ర‌కు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. హోరా హోరీగా జ‌రిగిన ఈ ఎన్నిక‌లకు సంబంధించిన‌ ఫ‌లితాలు మార్చి 10న విడుద‌ల కానున్నాయి. ఇక గోవా విష‌యానికి వ‌స్తే అక్క‌డ బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డిచింది. తాజాగా ఈ రెండు జాతీయ పార్టీల మ‌ధ్య నెక్ టు నెక్ ఫైట్ జ‌రిగింద‌ని, ఇటీవ‌ల‌ విడుద‌లైన ఎగ్జిట్ ఫ‌లితాలు కూడా ఇదే విష‌యాన్ని తెలిపాయి.

ఈ నేప‌ధ్యంలో గురువారం ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుదల కానున్న క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా త‌న అభ్య‌ర్ధుల‌ను క్యాంప్‌కు త‌ర‌లించింది. ఎందుకంటే గ‌త 2017 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లలో గెలిచినా అధికారానికి దూరం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధుల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డంలో స‌ఫ‌ల‌మైన బీజేపీ, గోవాలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చింది. దీంతో గ‌త చేదు అనుభ‌వాల నుంచి గుణ‌పాఠాలు నేర్చుకున్న కాంగ్రెస్, ఈసారి ముందు జాగ్ర‌త్త‌గా త‌న పార్టీ అభ్య‌ర్ధుల‌ను రిసార్టుకు త‌ర‌లించింది.

ఇక గోవాలో హంగ్ దిశగా ప్రభుత్వం ఏర్పడే అవకాశముందని అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థ‌లు తేల్చిచెప్పాయి. దీంతో అక్క‌డ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ క్ర‌మంలో హోరాహోరీ ప్రచారంతో ప్రజల మనసులు గెలుచుకునేందుకు పార్టీలు చేసిన ప్రయత్నం ఏ మేరకు ఫలిచిందన్న విషయంపై తీవ్రమైన చర్చ సాగుతోంది. ప్రీ పోల్స్‌, ఎగ్జిట్‌ పోల్స్‌లో కూడా అదే సస్పెన్స్‌లో పెట్టాయి. గోవాలో ఈసారి రాజకీయం నువ్వా-నేనా అనేలా సాగింద‌ని, అయితే గోవా ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపలేదని తెలుస్తోంది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో ప‌లు స‌ర్వేల ద్వారా ఆశ‌క్తికరమైన అంశాలు తెలిశాయి.

పోలింగ్‌బూత్‌ల నుంచి ఓటర్లు వస్తున్న టైంలో అడిగిన సమాచారాన్న ప్ర‌కారం, కాంగ్రెస్ 12-16 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా అదే స్థాయిలో సీట్లు కైవశం చేసుకోవచ్చని ఓట‌ర్లు స‌మాధానం ఇచ్చారు. ఈ క్ర‌మంలో బీజేపీ 13 నుంచి 17 స్థానాలు గెలుచుకోవచ్చని ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టం చేశాయి. మ‌రోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి ఐదు సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ కూడా ఈసారి కీలకం కానున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి ఐదు నుంచి తొమ్మిది స్థానాలు గెలుచుకునే అవ‌కాశం ఉంద‌ని ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేశాయి. ఇదే జరిగితే ఈ పార్టీవైపు ప్రధాన పార్టీలు చూస్తాయన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా ఈసారి గోవా ఎన్నిక‌లు ఫ‌లితాలు ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయానికి తెర‌లేప‌న్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.