Agniveers: 10 శాతం రిజర్వేషన్ తో అగ్నివీర్ లకు కలిసొచ్చేది ఎంత?

అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

  • Written By:
  • Publish Date - June 18, 2022 / 09:24 PM IST

అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేంద్రం ఈ పథకం విషయంలో కొన్ని సడలింపులు ఇస్తోంది. మరికొన్ని సదుపాయాలు కల్పిస్తోంది. అందులో భాగంగా.. రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నట్టు ప్రకటించింది. శనివారం నాడు రక్షణ శాఖ దీనిపై ట్విట్ చేసింది. యువతకు అగ్నిపథ్ పై విశ్వాసం కల్పించడం కోసం ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యంలో నాలుగేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న అగ్నివీర్ లకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది.

డిఫెన్స్ సివిలియన్ పోస్ట్ లతో పాటు ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇంకా 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ విభాగాలలోనూ ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. అర్హత ఉన్న అగ్నివీర్ లకు ఇది సువర్ణావకాశం అంటోంది కేంద్రం. సైనికులకు ఎక్స్ సర్వీస్ మెన్ కోటాతో పాటు.. కొత్తగా రిజర్వేషన్ ను కూడా అమలు చేస్తారు. దీనికి సంబంధించి రూల్స్ లో కూడా మార్పులు చేస్తారు. ఇప్పటికే గరిష్ట వయో పరిమితిని కూడా పెంచింది కేంద్రం. 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచింది.

త్రివిధ దళాల ఉన్నతాధికారులతో భేటీ తరువాత కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అగ్నివీర్ లకు ఇప్పటికే అస్సాం రైఫిల్స్, కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్రం చెప్పింది. ఈ రెండింటిలో చేరాలనుకునేవారికి మూడేళ్ల గరిష్ట వయోపరితికి కూడా సడలింపు ఇస్తామని చెప్పింది.

కేంద్రంలో ఇతర శాఖలు కూడా అగ్నివీర్ ల సర్వీస్ పూర్తయ్యాక వారిని తమ శాఖల్లో నియమించుకోవడానికి ప్రయత్నం చేస్తామన్నాయి. గృహ, చమురు మంత్రిత్వ శాఖ కింద చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయని.. రిటైర్ అయిన అగ్నివీర్ లను ఈ పీఎస్యూల్లో నియమించుకోవడానికి ప్రయత్నం చేస్తామని.. కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్ పురి అన్నారు. సో దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పై నిరనసలు ఎక్కువయ్యేసరికీ కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.