జమ్మూ కాశ్మీర్‌లో పాక్ దాడుల నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తరువాత పరిస్థితుల మధ్య జరిగిన కాల్పుల్లో సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ వీరమరణం పొందాడు. ఈ సందర్భంలో అగ్నిపథకం కింద సేవలందిస్తున్న సైనికుడికి విధి నిర్వహణలో మరణం చెందితే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక సహాయం చేస్తుందో తెలుసుకోవడం అవసరం. అగ్నిపథకం కింద చేరిన అగ్నివీర్లు నాలుగేళ్ల సర్వీసు ఇవ్వనుండగా, విధుల్లో అమరుడైతే వారి కుటుంబాలకు కేంద్రం పలు మార్గాల్లో సహాయం అందిస్తుంది.
Territorial Army : కేంద్రం మరో కీలక నిర్ణయం..రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ.. !
అమరుడైన అగ్నివీర్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం జీవన బీమా రూపంలో రూ.48 లక్షలు అందిస్తుంది. ఈ బీమా ప్రీమియంను కేంద్రమే భరిస్తుంది. అదనంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వారికి రూ.44 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. సర్వీస్ మిగిలిన కాలానికి సంబంధించిన పూర్తి జీతం కూడా కుటుంబానికి ఒకేసారి చెల్లించబడుతుంది. అలాగే అగ్నివీర్ సేవా నిధిలో జమ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా ఆ కుటుంబానికి అప్పగిస్తారు. ఈ మొత్తంపై ఎటువంటి ఆదాయపన్ను విధించబడదు.
ఇవి కాకుండా ఆర్మ్‌డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీ ఫండ్ ద్వారా మరింత ఆర్థిక సహాయం లభిస్తుంది. తక్షణ అవసరాల కోసం కుటుంబానికి తక్షణ సహాయం అందించబడుతుంది. మొత్తం మీద వీరమరణం పొందిన అగ్నివీర్ కుటుంబానికి కేంద్రం నుండి రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకు పరిహారం లభించే అవకాశం ఉంది. ఇది పరిస్థితులను బట్టి మారవచ్చు. అదనంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలు, గ్యాలంట్రీ అవార్డులు కూడా ఉండొచ్చు. అగ్నివీరుల త్యాగానికి అండగా నిలవడంలో ఈ విధమైన పథకాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇలా అగ్నిపథకం కింద సేవలందిస్తూనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం సముచిత గౌరవంతో పాటు ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకుంటోంది.