Agnipath : త్రివిధ దళాల యువ తేజస్సు “అగ్ని పథ్”కు శ్రీకారం.. ఇదేమిటి?

యువతను స్వల్పకాలికంగా త్రివిధ సైన్య దళాల్లోకి తీసుకునేందుకు అవకాశం కల్పించే "అగ్ని పథ్" రిక్రూట్మెంట్ స్కీం అందుబాటులోకి వచ్చింది.

  • Written By:
  • Publish Date - June 14, 2022 / 05:00 PM IST

యువతను స్వల్పకాలికంగా త్రివిధ సైన్య దళాల్లోకి తీసుకునేందుకు అవకాశం కల్పించే “అగ్ని పథ్” రిక్రూట్మెంట్ స్కీం అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక సైనిక నియామక ప్రక్రియను రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభించారు. దీనికి 17.5 నుంచి 21 ఏళ్లలోపు యువకులు అర్హులు.వీరిని ప్రత్యేక ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ శిక్షణకు ఎంపికయ్యే వారిని ” అగ్ని వీర్స్” అని పిలుస్తారు. 6 నెలల శిక్షణా కాలంతో కలుపుకొని మొత్తం నాలుగేళ్ల పాటు వీరు సైన్యంలో సేవలు అందిస్తారు. ఈక్రమంలో ప్రతినెలా రూ.45 వేల వేతనం, వైద్య ప్రయోజనాలతో పాటు రూ.48 లక్షల బీమా కవరేజీ కూడా కల్పిస్తారు. మరో 90 రోజుల్లోగా 46000 మంది భర్తీ లక్ష్యంగా.. “అగ్ని పథ్” తొలి బ్యాచ్ నియామక ప్రక్రియ మొదలుకానుంది. 2023 జూన్ లోగా మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇలా చేరే వారిలో..నాలుగేళ్ళ తర్వాత కేవలం 25 శాతం మంది అగ్ని వీర్ల ఉద్యోగాలను సైన్యంలోకి రెగ్యులరైజ్ చేస్తారు. రెగ్యులరైజ్ అయ్యే వాళ్ళు నాన్ ఆఫీసర్ ర్యాంకుల్లో 15 ఏళ్ళ పాటు పనిచేయొచ్చు. మిగితా 75 శాతం మంది మాత్రం ప్రభుత్వం అందించే రూ.12 లక్షల గౌరవ ప్యాకేజీ తో వైదొలగాల్సి ఉంటుంది. వీరికి పెన్షన్ ప్రయోజనాలు వర్తించవు. ఇలా వైదొలగే వారు భవిష్యత్ లో ఉన్నత విద్య చదవాలన్న.. వ్యాపారం పెట్టుకోవాలనుకున్నా బ్యాంకు లోన్ ను కేంద్రం ఇప్పిస్తుంది. ఏటా భారత రక్షణ బడ్జెట్ లో దాదాపు సగం సైన్యం జీతాలు, పెన్షన్ నిధికి సంబంధించిన కేటాయింపులకే సరిపోతుంది. అగ్ని పథ్ స్కీం ద్వారా సైనికులను భర్తీ చేసుకునే ప్రక్రియను విజయవంతంగా అమలు చేయగలిగితే.. సైన్యం వేతనాలు, పెన్షన్లకు కేటాయింపులు గణనీయంగా తగ్గిపోతాయని మోడీ సర్కారు యోచిస్తోంది.