Loksabha : లోక్ స‌భ‌లో `పెట్రో` మంటలు

ఇంధన ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీ, శివసేన సహా విపక్ష సభ్యులు సోమవారం లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు.

  • Written By:
  • Publish Date - April 4, 2022 / 04:31 PM IST

ఇంధన ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీ, శివసేన సహా విపక్ష సభ్యులు సోమవారం లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. జీరో అవర్ ప్రారంభమైన వెంటనే డీఎంకే సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఆ తర్వాత ఇతర ప్రతిపక్షాల సభ్యులు కూడా ఇంధన ధరల పెరుగుదల అంశాన్ని లేవనెత్తుతూ వెల్‌లోకి దూసుకెళ్లారు.సభా కార్యక్రమాలకు అధ్యక్షత వహించిన రాజేంద్ర అగర్వాల్ జీరో అవర్‌ను కొనసాగించడంతో కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, వామపక్షాలు, శివసేన, ఎన్సీపీ వాకౌట్ చేశాయి.


అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో గత 14 రోజుల్లో 12వ సారి పెట్రోల్ ధరలు పెంచారు. మొత్తం మీద గడచిన రెండు వారాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.8.40 పెరిగింది. శ్రీనగర్ నుండి కొచ్చి వరకు అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర లీటర్ మార్కు రూ. 100 పైన ఉంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పెట్రో ధ‌ర‌ల‌పై సీరియ‌స్ గా ఆందోళ‌న‌కు దిగింది. అందులో బాగంగానే ఆ పార్టీ కీల‌క నేత రాహుల్ గాంధీ కూడా మోదీ స‌ర్కారుపై ఓ రేంజిలో విరుచుకుప‌డుతున్నారు. తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా రాహుల్ గాంధీ సంధించిన ఓ పోస్టు జ‌నాన్ని ఆక‌ట్టుకుంటోంది. బైక్‌, కారు, ట్రాక్ట‌ర్‌, లారీ..ఇలా ప‌లు వాహ‌నాల ఇంధ‌న ట్యాంక్‌ను ఫుల్ చేసుకోవాలంటే గ‌తంలో అయ్యే ఖ‌ర్చుకు ఇప్పుడు దాదాపుగా రెట్టింపు ఖ‌ర్చు అవుతోంది. రాహుల్‌..ఆయా వాహ‌నాల ట్యాంకుల‌ను ఫుల్ చేసుకునేందుకు గ‌తంలో వెచ్చించిన మొత్తం..ఇప్పుడు వెచ్చించాల్సి వ‌స్తున్న మొత్తాల‌తో కూడిన అంకెల‌తో ట్వీట్ ను సంధించారు. ఈ ట్వీట్ కు ప్ర‌ధాన మంత్రి జన్ ధ‌న్ లూట్ యోజ‌న అంటూ పేరు పెట్ట‌డం రాహుల్ ట్వీట్ లోని హైలెట్ పాయింట్‌.