Site icon HashtagU Telugu

Kamal Nath – BJP : కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలోకి కమల్‌నాథ్.. ? నకుల్‌నాథ్ సిగ్నల్

Kamal Nath

Kamal Nath Bjp

Kamal Nath – BJP :ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీలోకి జంప్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి నెక్ట్స్ షాక్ మధ్యప్రదేశ్‌లో తగలబోతోంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌ సీనియర్ నేత , మాజీ సీఎం కమల్‌నాథ్ కూడా కమలదళంలోకి వెళ్లబోతున్నారనే వార్తలు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతల కోసం బీజేపీ తలుపులు తెరిచింది. హస్తం పార్టీ ముఖ్యనేతలను తమ వైపునకు లాక్కొని బలంగా సార్వత్రిక ఎన్నికల బరిలోకి దూకాలని కమలదళం యోచిస్తోంది. ఈక్రమంలోనే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ దిగ్గజం కమల్‌నాథ్‌ను(Kamal Nath – BJP) తమ వైపునకు లాగుతోందని తెలుస్తోంది. నేడో, రేపో కమల్ నాథ్ బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి.

సిగ్నల్ పంపిన నకుల్ నాథ్.. 

దీనికి సంబంధించిన బలమైన సంకేతాలను కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ సోషల్ మీడియా వేదికగా పంపారు. నకుల్ నాథ్ తన ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్‌లోని బయో (వ్యక్తిగత సమాచారం) నుంచి కాంగ్రెస్ పార్టీ పేరును తీసేశారు. తదుపరిగా తమ అడుగులు బీజేపీ వైపే అనే సిగ్నల్స్‌ను దీని ద్వారా ఆయన ఇచ్చారు.మధ్యప్రదేశ్‌లోని ఏకైక లోక్‌సభ కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్. వచ్చే ఎన్నికల్లోనూ తాను చింద్వారా లోక్‌సభ స్థానం నుంచే పోటీచేస్తానని ఆయన స్వయంగా ఇటీవల ప్రకటించుకున్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కమల్‌నాథ్ బీజేపీలోకి వెళ్లేముందు పలువురు తన అనుచరులను, మాజీ ఎమ్మెల్యేలను ఇప్పటికే ఆ పార్టీలోకి పంపించేశారు. ఫిబ్రవరి 12న మాజీ ఎమ్మెల్యే దినేష్ అహిర్వార్, విదిశకు చెందిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాకేష్ కటారే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కమల్ నాథ్ వ్యవహరించారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర ఓటమి ఎదురైంది. దీంతో వెంటనే కమల్ నాథ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఆ నాటి నుంచే కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవాలనే ప్లాన్‌లో కమల్ నాథ్ ఉన్నారని అంటున్నారు. ‘‘అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుక వేళ  పంపిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది. ఈ నిర్ణయం వల్ల ఆ పార్టీకి చెందిన ఎంతోమంది నాయకులు నిరాశకు, ఆవేదన గురయ్యారు. అలాంటి వాళ్లంతా బీజేపీ వైపే చూస్తున్నారు’’ అని బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ అన్నారు. కమల్ నాథ్ బీజేపీ వైపు చూస్తున్నారనే అంశంపై ఆయన స్పందిస్తూ.. ‘‘ మేం మా తలుపులు తెరిచి ఉంచాం. ఎందుకంటే కాంగ్రెస్ రాముడిని బహిష్కరిస్తోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే వాళ్లకు మేం తప్పకుండా బీజేపీలో అవకాశం ఇస్తాం’’ అని స్పష్టం చేశారు.

Exit mobile version