మధుర శ్రీకృష్ణుడు జన్మస్థలం. ఆ ప్రాంతంలో ప్రముఖ దేవాలయం ఉంది. దాని సమీపంలోనే మసీదు ఉండడం వివాదంగా మారింది. దేవాలయం, మసీదు స్థలాలపై కోర్టులోనూ కేసులు ఉన్నాయి. శ్రీకృష్ణ జన్మస్థలంగా ఉన్న మసీదు స్థలాన్ని తిరిగి పొందాలని గత ఏడాది మధుర సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆనాటి నుంచి హిందూ, ముస్లింల మధ్య వివాదం నెలకొంది. అయోధ్య, కాశీ తరహాలోనే మతపరమైన అంశం మధురలో తెరమీదకు రావడంతో రాజకీయం కూడా సంతరించుకుంది.
కొన్ని దశాబ్దాలుగా అయోధ్య వివాదం నడిచింది. బాబ్రీ మసీదు, రామజన్మభూమి వాదాలతో అయోధ్య నిత్యం టెన్షన్ మధ్య ఉండేది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ అయిన తరువాత అయోధ్య వివాదానికి పరిష్కారం లభించింది. భవ్యమైన రామమందిరం అక్కడ నిర్మిస్తున్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆయోధ్యలో రామ మందిరాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీగా వచ్చిన విరాళాలతో చరిత్రలో నిలిచిపోయేలా దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. కాశీ కేత్రం రూపురేఖల్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మార్చేశాడు. అక్కడ కూడా దేవాలయాన్ని ఆనుకుని మసీదు ఉంది. ఎప్పుడూ భారీ భద్రత నడుమ టెన్షన్ వాతావరణంలో కాశీ విశ్వనాథుని దర్శనాన్ని భక్తులు చేసుకునే వాళ్లు. మసీదు నిర్వాహకులతో సంప్రదింపులు జరిపిన తరువాత కాశీ క్షేత్రాన్ని ఆధునాతనంగా నిర్మించడానికి కేంద్రం సంకల్పించింది. కాశీ కారిడార్ ను వారం క్రితం మోడీ ప్రారంభించారు.
గంగా క్లీనింగ్ ప్రాజెక్టు నడుస్తోంది. కాశీ కారిడార్ నుంచి గంగామాత కనిపించేలా అందంగా కాశీక్షేత్రాన్ని మోడీ మార్చేశాడు. అయోధ్య, కాశీ క్షేత్రాల తరువాత మధుర అంశాన్ని ఇప్పుడు బీజేపీ తెరమీదకు తీసుకొస్తుంది. మధురలోని శ్రీకృష్ణుడి దేవాలయం సమీపంలోని మసీదు స్థలం విషయాన్ని కూడా పరిశీలించాలని అక్కడి నేతలు కోరుతున్నారు. ఆ నియోజకవర్గం ఎంపీగా ఉన్న హేమమాలిని కూడా కాశీ, అయోధ్య తరహాలోనే మధురను ఆధునీకరించాలని కోరుతున్నారు. మథురలో పెరుగుతున్న మతతత్వాల గురించి ఆమె ప్రస్తావించారు. మితవాద హిందుత్వ గ్రూపులు కృష్ణుడి “అసలు జన్మస్థలం` ప్రముఖ దేవాలయానికి దగ్గరగా ఉన్న మసీదు లోపల ఉందని భావిస్తున్నారు. అయోధ్క తరహా వివాదం మధురలో నెలకొనడం గమనార్హం.
