Actor Vijay : ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీ అధినేత, హీరో విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే భారత పార్లమెంటు ఆమోదించిన ‘వక్ఫ్ సవరణ చట్టం-2025’ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ముస్లిం వర్గంతో ముడిపడిన ‘వక్ఫ్ సవరణ చట్టం-2025’కు సంబంధించిన న్యాయపోరాటానికి విజయ్ తెరతీయడం గమనార్హం. తమిళనాడు రాష్ట్ర జనాభాలో 87.6 శాతం మంది హిందువులు, 6.12 శాతం మంది క్రైస్తవులు, 5.86 శాతం మంది ముస్లింలు ఉన్నారు.
Also Read :Man Vs Dogs : పోయే కాలం.. కుక్కలపై యువకుడి అత్యాచారాలు
కేంద్ర ప్రభుత్వం కేవియట్..
‘వక్ఫ్ సవరణ చట్టం-2025’ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఇప్పటికే కాంగ్రెస్, ఎంఐఎంతో పాటు పలువురు సుప్రీంకోర్టులో(Actor Vijay) పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై ఏప్రిల్ 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే 10 పిటిషన్లు దాఖలవగా, మరికొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట లిస్ట్ కావాల్సి ఉంది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ఉన్నారు. ఈ పిటిషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం గత మంగళవారమే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలను జారీ చేయొద్దని సుప్రీంకోర్టు బెంచ్‌ను కేంద్ర సర్కారు కోరింది. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం, ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమ్మతితో ‘వక్ఫ్ సవరణ చట్టం-2025’ కొన్ని రోజుల క్రితమే అమల్లోకి వచ్చింది.
Also Read :Rooh Afza Vs Patanjali : షర్బత్ బిజినెస్.. రూహ్ అఫ్జాతో పతంజలి ఢీ
వక్ఫ్ సవరణ బిల్లుపై నిరసనలు
వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 19న హైదరాబాద్‌లో మజ్లిస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ నెల 23న చలో హైదరాబాద్‌లో పాల్గొనాలని ముస్లిం మతపెద్దలు పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు ప్రకటించారు. ఈ క్రమంలో విపక్ష పాలిత రాష్ట్రాల్లో వక్ఫ్ సవరణ బిల్లుపై నిరసనలు ఎలాంటి మలుపును తీసుకుంటాయో వేచి చూడాలి.