మళ్లీ కింగ్ లు.. వీళ్లే..!

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంద‌ని ఏబీపీ-సీ వాట‌ర్స్ స‌ర్వే తేల్చేసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్, గోవా, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో స్ప‌ష్ట‌మైన మెజార్టీని బీజేపీ సాధించ‌నుంది. పంజాబ్ రాష్ట్రంలో మాత్రం సంకీర్ణం ఏర్పడే అకాశం ఉంద‌ని స‌ర్వేలో తేలింది.

  • Written By:
  • Publish Date - October 9, 2021 / 03:36 PM IST

  • ఏబీపీ-సీ వాట‌ర్ సంచ‌ల‌న స‌ర్వే
  • యూపీతో స‌హా 4 చోట్ల బీజేపీ హ‌వా

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంద‌ని ఏబీపీ-సీ వాట‌ర్స్ స‌ర్వే తేల్చేసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్, గోవా, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో స్ప‌ష్ట‌మైన మెజార్టీని బీజేపీ సాధించ‌నుంది. పంజాబ్ రాష్ట్రంలో మాత్రం సంకీర్ణం ఏర్పడే అకాశం ఉంద‌ని స‌ర్వేలో తేలింది. పార్టీల వారీగా చూసుకుంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆప్ సీట్ల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని వివ‌రించింది. పంజాబ్‌, గోవా, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో ఆప్ మూడో పెద్ద పార్టీగా అవ‌త‌రించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌ర్వే చెబుతోంది. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ తీవ్ర‌మైన పోటీని ఆప్ నుంచి ఎదుర్కోబోతుంద‌ని ప్ర‌త్యేకించి పంజాబ్‌, మ‌ణిపూర్ ల‌లో ఎక్కువ‌గా చూడ‌బోతున్నామ‌ని స‌ర్వే విశ‌దీక‌రించింది.
తొలి విడ‌త ఏబీపీ-సీ వాట‌ర్ చేసిన స‌ర్వే ప్ర‌కారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో బీజేపీ తిరిగి 41.4శాతం ఓటు బ్యాంకును సంపాదించ‌బోతుంది. అఖిలేష్ ఆధ్వ‌ర్యంలో ఎస్పీ 32శాతం, బీఎస్పీ 15శాతం, కాంగ్రెస్ కేవ‌లం 6శాతం, ఇత‌రులు 6శాతం ఓట్లను పొందే ఛాన్స్ ఉంది. మొత్తం సీట్ల‌లో 241 నుంచి 249 బీజేపీ, ఎస్పీ 130 నుంచి 138, బీఎస్పీ 15 నుంచి 19 సీట్ల‌ను పొందే అవ‌కాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 3 నుంచి 7 సీట్ల‌కు ప‌రిమితం కానుంది.
పంజాబ్ లో సంకీర్ణ ప్ర‌భుత్వం ఆప్ ఆధ్వ‌ర్యంలో ఏర్ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. మొత్తం 117 సీట్లున్న పంజాబ్ లో ఆప్ 36, కాంగ్రెస్ 32, శిరోమ‌ణి అకాలీద‌ళ్ 22, బీజేపీ 4, ఇత‌రులు 6శాతం ఓట్లను పొంద‌నున్నాయి. సీట్ల రూపంలో ఆప్ 49 నుంచి 55, కాంగ్రెస్ 30 నుంచి 47, అకాలీద‌ళ్ 17 నుంచి 25, బీజేపీ 0 నుంచి 1,ఇత‌రులు 0 నుంచి 1 ల‌భించే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వే చెబుతోంది. పంజాబ్ లో దాదాపు బీజేపీ ఏమీ లేన‌ట్టే స‌ర్వే తేల్చేసింది.
ఉత్త‌రాఖండ్ లో మ‌రోసారి బీజేపీ అధికారంలోకి రానుంది. సర్వే ప్ర‌కారం కాంగ్రెస్ 34శాతం, బీజేపీ 45, ఆప్ 15, ఇత‌రులు 6శాతం ఓట్ల‌ను పొంద‌నున్నారు. సీట్ల రూపంలో కాంగ్రెస్ 21 నుంచి 25, బీజేపీ 42 నుంచి 46, ఆప్ 0 నుంచి 4, ఇత‌రులు 0 నుంచి 2 రానున్నాయి.
గోవాలో ఈసారి పూర్తి స్థాయి మెజార్టీతో బీజేపీ మ‌ళ్లీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నుంది. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో ‌స‌ర్వే ప్ర‌కారం బీజేపీ 24 నుంచి 28 సీట్లు, కాంగ్రెస్ 1 నుంచి 5, ఆప్3 నుంచి 7, ఇత‌రులు4 నుంచి 8 సీట్లు పొందే ఛాన్స్ ఉంది. ఓట్ల‌శాతం రూపంలో బీజేపీ 38, కాంగ్రెస్ 18, ఆప్ 23, ఇత‌రులు 21 గా ఉంది. అతి పెద్ద పార్టీగా గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సీట్ల‌ను పొందిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.
స‌ర్వే ప్ర‌కారం మ‌ణిపూర్ లో 21 నుంచి 25 సీట్ల‌ను సాధించ‌డం ద్వారా బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతుంది. కాంగ్రెస్ 18 నుంచి 22 సీట్ల‌ను గెలుచుకోవ‌డం ద్వారా గట్టిపోటీని ఇవ్వ‌నుంది. నాగాపీపుల్స్ ఫ్రంట్ 4 నుంచి 8 సీట్ల‌ను పొంద‌నుంది. ఇత‌రులు 1 నుంచి 5సీట్ల‌ను కైవ‌సం చేసుకునే ఛాన్స్ ఉంది. క‌నీసం 31 సీట్ల‌ను గెలుచుకున్న పార్టీ ఇక్క‌డ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌కాశం ఉంది. ఓట్ల శాతం ప‌రంగా 36శాతం బీజేపీ, కాంగ్రెస్ 34, ఎన్పీఎఫ్ 9, ఇత‌రులు 21శాతం కైవ‌సం చేసుకుంటాయ‌ని స‌ర్వే చెబుతోంది.