Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాకు ఊహించని షాక్ ఇచ్చింది. రాజ్యసభలో పార్టీ ఉపనేత (డెప్యూటీ లీడర్) పదవి నుండి ఆయనను తొలగించాలని కోరుతూ పార్టీ రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాసింది. అంతేకాకుండా సభలో ఆప్ కోటా నుండి ఆయనకు మాట్లాడే సమయం కేటాయించవద్దని కూడా అభ్యర్థించింది. రాఘవ్ చద్దా స్థానంలో పంజాబ్ రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ మిట్టల్‌ను కొత్త ఉపనేతగా నియమించాలని పార్టీ కోరింది.
పార్టీ కార్యకలాపాలకు దూరం, మౌనమే కారణమా?
పార్టీ పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకపోవడం వల్లే రాఘవ్ చద్దాపై ఈ చర్య తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కీలకమైన పార్టీ అంశాలపై ఆయన చాలా కాలంగా మౌనం వహిస్తున్నారు. ముఖ్యంగా గతంలో మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించినప్పుడు, చద్దా ఆయనను కలవడానికి రాలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎటువంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఈ మౌనాన్ని పార్టీకి దూరం జరగడంగా భావించిన నాయకత్వం.. బాధ్యతాయుతమైన పదవి నుండి ఆయనను తొలగించాలని నిర్ణయించుకుంది.
Also Read: పీఎఫ్‌పై బాంబే హై కోర్టు కీలక తీర్పు!
అశోక్ కుమార్ మిట్టల్‌కే ఎందుకు ఈ బాధ్యత?
అశోక్ కుమార్ మిట్టల్ పంజాబ్ నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన 2022లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. వ్యవసాయం, విద్యారంగాల్లో ఆయనకు మంచి పట్టు ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాలపై ఆయన గళమెత్తుతారు. స్వతహాగా శాంత స్వభావి అయినప్పటికీ తన వాదనలను బలంగా, తర్కబద్ధంగా వినిపించి అందరినీ ప్రభావితం చేస్తారు. పార్టీలో సీనియర్, అనుభవజ్ఞుడైన నాయకుడు కావడంతో ఆయనకు ఈ కీలక పదవిని అప్పగించారు.
ప్రజా సమస్యలపై గళం.. కానీ పార్టీకి దూరం
గత కొంతకాలంగా రాఘవ్ చద్దా ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఎయిర్‌పోర్టుల్లో రూ. 10 టీ అంశం, డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన బలంగా వినిపించారు. దీనివల్ల జోమాటో, స్విగ్గీ వంటి సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. రెండు రోజుల క్రితమే ఆయన సభలో ‘ప్యాటర్నిటీ లీవ్’ (తండ్రులకు ఇచ్చే సెలవు) గురించి డిమాండ్ చేస్తూ దీనికి చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశంలోని కోట్లాది మంది తండ్రుల తరపున ఆయన తన గళాన్ని వినిపించారు. అయినప్పటికీ పార్టీ అంతర్గత వ్యవహారాలకు దూరంగా ఉండటమే ప్రస్తుత పరిణామాలకు కారణమని తెలుస్తోంది.
