Site icon HashtagU Telugu

Madhya Pradesh Elections: ఆప్ మరో కీలక ప్రకటన.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ

Arvind Kejriwal

Arvind Kejriwal (2)

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ సార‌థ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మ‌రో ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 230 స్థానాల్లో పోటీ చేయనుంది. ప్రజలు కనెక్ట్ కావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ మిస్డ్ కాల్ నంబర్‌ను కూడా జారీ చేసింది. దీనితో పాటు.. పంజాబ్, ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాల హామీ కూడా ఇచ్చారు.

పంజాబ్, ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కన్ను మధ్యప్రదేశ్ పై పడింది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ మాట్లాడుతూ.. “కాంట్రాక్ట్ కార్మికుల కన్ఫర్మేషన్ మధ్యప్రదేశ్‌లో ఆప్ ప్రధాన అంశంగాఉంటుంది. ఢిల్లీ-పంజాబ్ ల‌లో మాదిరిగా సంక్షేమ ప‌థ‌కాలు తీసుకువ‌స్తాం.” అని అన్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉందని ఆయన అన్నారు.

కాగా, మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానాలపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటనతో కాంగ్రెస్ లో టెన్షన్ పెరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చిన కాంగ్రెస్‌ శిబిరంలో గుజరాత్‌ తరహాలో ఆమ్‌ ఆద్మీ పార్టీ చెలరేగిపోతుందన్న ఆందోళన నెలకొంది. గతేడాది గుజరాత్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆమ్ ఆద్మీ 5 సీట్లు గెలుచుకుంది. అయితే ఆప్ సాధించిన ఓట్ల శాతం అందరినీ, ముఖ్యంగా కాంగ్రెస్‌ను ఆశ్చర్యపరిచింది. ఆప్‌కి 12.9 శాతం ఓట్లు వచ్చాయి. ఇది కాకుండా 35 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రన్నరప్‌గా నిలిచింది.

Also Read: Chinese Apps Ban: మరో 232 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం

గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి 16 సీట్లు మాత్రమే వచ్చాయి. గతంలో 2017లో కాంగ్రెస్‌కు 77 సీట్లు వచ్చాయి. 2017లో కాంగ్రెస్‌కు దాదాపు 43 శాతం ఓట్లు రాగా, 2022 నాటికి అది 27 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ ఓట్ల శాతం 16 శాతం తగ్గగా.. ఆప్ కు దాదాపు 13 శాతం ఓట్లు రావడం గమనార్హం. కాంగ్రెస్‌ ఓట్లు ఆప్‌కి మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి కాంగ్రెస్‌లో టెన్షన్‌ను పెంచింది. గుజరాత్‌లో మాదిరిగా మధ్యప్రదేశ్‌లోనూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓట్లను చీల్చడంలో విజయం సాధిస్తే.. కాంగ్రెస్‌కు దారి కష్టమే. ఇది అసెంబ్లీ ఎన్నికలకే కాదు, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఝలక్ ఇవ్వొచ్చు. రాజస్థాన్‌లో కూడా ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది.