AAP Vs Congress : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సంవత్సరం (2025) ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ తరుణంలో హస్తిన పాలిటిక్స్ హీటెక్కాయి. కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఇటీవలే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై చేసిన విమర్శలతో ఆప్, కాంగ్రెస్ మధ్య గ్యాప్ అమాంతం పెరిగిపోయింది. ఈనేపథ్యంలో ఇవాళ ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఇవాళ మీడియా సమావేశం వేదికగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. అరవింద్ కేజ్రీవాల్‌పై అజయ్ మాకెన్ చేసిన వ్యాఖ్యలను వారు తప్పుపట్టారు. ఒకవేళ అజయ్ మాకెన్‌పై(AAP Vs Congress) కాంగ్రెస్ క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోతే.. ఆ పార్టీని ఇండియా కూటమి నుంచి తొలగించాలని తాము కోరుతామని సంజయ్ సింగ్, అతిషి ప్రకటించారు.
Also Read :Sonu Sood : పిలిచి సీఎం పోస్టును ఇస్తామంటే.. వద్దని చెప్పాను : సోనూ సూద్
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పేర్కొన్నారు. బీజేపీ రాసిచ్చిన స్క్రిప్టునే అజయ్ మాకెన్ చదివారని ధ్వజమెత్తారు. ‘‘అరవింద్ కేజ్రీవాల్ దేశ వ్యతిరేకి అని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ 24 గంటల్లోగా అతడిపై చర్యలు తీసుకోవాలి. ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను బీజేపీయే రెడీ చేసినట్టు కనిపిస్తోంది. మొత్తం మీద ఆప్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా కాంగ్రెస్ బరిలోకి దిగుతోంది’’ అని ఆప్ నేత సంజయ్ సింగ్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల వల్ల ఇండియా కూటమి ఐక్యతకు విఘాతం కలిగే ముప్పు ఉంటుందన్నారు.
Also Read :Business Lookback 2024 : దేశం గర్వించే పారిశ్రామిక దిగ్గజాలు.. 2024లో మనకు దూరమైన వేళ..
అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీతో కాంగ్రెస్ చేతులు కలిపినట్టుగా కనిపిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆరోపించారు. ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్, బీజేపీ ఒకేవిధమైన రీతిలో విమర్శిస్తున్నాయని పేర్కొన్నారు.“అరవింద్ కేజ్రీవాల్ దేశ వ్యతిరేకి అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పుడైనా బీజేపీ నేతలపై ఇలాంటి ఆరోపణలు చేశారా ?’’ అని అతిషి ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నిన్న నాపై, అరవింద్ కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఎందుకు? కాంగ్రెస్ ఎవరైనా బీజేపీ నాయకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా?’’ అని ఆమె ప్రశ్నలు సంధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థులకు బీజేపీ నిధులు ఇస్తోందని ఆరోపించారు. ‘‘సందీప్ దీక్షిత్‌కు బీజేపీ నిధులు అందజేస్తోందని విన్నాం.. కాంగ్రెస్, బీజేపీ మధ్య అవగాహన లేకుంటే 24 గంటల్లోగా అజయ్ మాకెన్‌పై చర్యలు తీసుకోవాలి’’ అని అతిషి డిమాండ్ చేశారు.