Haryana Assembly Polls : హర్యానా అసెంబ్లీ ఎన్నిక నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేసింది. ఇటీవల మూడు జాబితాల్లో 40మంది అభ్యర్థులను ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మరో 21మందితో నాలుగో జాబితాను విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు ఆప్ 61మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది. జులనా సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై మరో రెజ్లర్ కవితా దలాల్‌ను బరిలోకి దించింది. 2022లో ఆప్‌లో చేరిన కవిత గతంలో డబ్ల్యూడబ్ల్యూఈలో ప్రదర్శన ఇచ్చారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా యోగేశ్ బైరాగి పోటీలో ఉన్నారు.
Read Also: Delhi Liquor Scam: మద్యం కేసులో అరుణ్ పిళ్లైకి బెయిల్
కాగా, కర్నాల్ నుంచి సునీల్ బిందాల్, సిర్సా నుంచి షామ్ మెహతా, యమునానగర్ నుంచి లలిత్ త్యాగి, హిసార్ నుంచి సంజయ్ సత్రోదియా, గుర్గావ్ నుంచి నిశాంత్ ఆనంద్ బరిలోకి దిగారు. కాంగ్రెస్‌తో పరస్పరం ఆమోదయోగ్యమైన సీట్ల పంపకాల ఫార్ములాకు రాకపోవడంతో హర్యానాలో ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్న ఆప్ పార్టీ సోమవారం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానా శాసనసభకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తాయని భావించినప్పటికీ సీట్ల సర్దుబాటు అంశంలో ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆప్ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే వరుసగా అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తోంది.