AAP : ఇండియా (INDIA) ప్రతిపక్ష కూటమికి వరుస షాకులు తగులుతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో, ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాల్సిన అంశాలపై చర్చించేందుకు నేడు ఇండియా కూటమి సమావేశం జరగనుంది. అయితే, ఈ సమావేశానికి ముందే కీలక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అనూహ్యంగా కూటమి నుంచి నిష్క్రమించనుందని ప్రకటించగా, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కూడా సమావేశానికి దూరంగా ఉండబోతున్నట్టు స్పష్టం చేసింది.
ఆప్ సంచలన నిర్ణయం
ఇండియా కూటమి సమన్వయ లోపంతో విఫలమవుతోందని ఆరోపించిన ఆప్, కూటమి నుంచి పూర్తిగా బయటకి వచ్చినట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రమే తమ పొత్తు ఉందని, ఢిల్లీ, హర్యానా ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే తరహా వ్యూహంతో ముందుకెళ్తామన్నారు. ఉప ఎన్నికల్లోనూ ఆప్ స్వతంత్రంగా పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ కూడా దూరం
ఇండియా కూటమి సమావేశానికి తాము హాజరు కాబోదని ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మాత్రం నేటి ఆన్‌లైన్ మీటింగ్‌కు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇది పార్టీలో అంతర్గత విభేదాల సంకేతంగా విశ్లేషణ జరుగుతోంది.
కాంగ్రెస్ సమన్వయ కసరత్తు
ఇండియా కూటమిలో ఈ అనేక విభేదాల మధ్య, కాంగ్రెస్ పార్టీ కూటమిని ఐక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, శనివారం సాయంత్రం 7 గంటలకు ఇండియా కూటమి ఆన్‌లైన్ సమావేశం జరగనున్నట్టు ఎక్స్‌లో ఒక పోస్ట్ ద్వారా తెలిపారు. కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరామ్ రమేశ్ మాట్లాడుతూ.. కూటమి నాయకులు శనివారం ఆన్‌లైన్‌లో చర్చించిన తరువాత ఢిల్లీలో ప్రత్యక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.
చర్చకు కీలక అంశాలు
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ముఖ్యంగా, బీహార్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక పునఃసమీక్ష (Special Intensive Revision – SIR), జమ్మూకశ్మీర్‌లో పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి అంశాలపై నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశానికి కూటమిలోని అన్ని పార్టీలు హాజరవుతాయని జైరామ్ రమేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఆప్, టీఎంసీ వంటి ముఖ్యమైన పార్టీలు కూటమి సమావేశాలకు దూరంగా ఉండటంతో, ఇండియా కూటమి ఐక్యతపై మరింత సందేహాలు తలెత్తుతున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల ముందు కూటమి పునఃసంఘటన అవసరమైందన్న అభిప్రాయం రాజకీయం వర్గాల్లో వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో, విభిన్న పార్టీలు తమ స్వార్థాలకు అనుగుణంగా వ్యవహరిస్తుండటంతో ప్రతిపక్ష ఐక్యత ఎంతవరకు సాధ్యమవుతుందన్నదానిపై అనేక ప్రశ్నలు నెలకొన్నాయి.