Site icon HashtagU Telugu

AAP Staretegy: పంజాబ్ లో మంత్రి తొలగింపు, అరెస్ట్ వ్యవహారం ఆప్ కి ప్లస్సా? మైనస్సా?

Vijay Singla

Vijay Singla

అవినీతి లేని స్వచ్ఛమైన, పారదర్శక రాజకీయాలనే చేస్తామంటూ పంజాబ్ లో అధికారంలోకి వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. అందుకే ఆరోగ్యమంత్రి విజయ్ సింగ్లాను మంత్రి పదవి నుంచి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తొలగించారు. ఆరోగ్యశాఖలో కొనుగోళ్లు, టెండర్ల విషయంలో ఒక శాతం కమిషన్ ను ఆయన కోరినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఎం.. స్వయంగా ఆరోగ్యమంత్రితో మాట్లాడడం, ఆయన దానిని ఒప్పుకోవడం, వెనువవెంటనే విజయ్ ను మంత్రి పదవినుంచి తొలగించడం, అరెస్ట్ చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. మరి ఇదంతా ఆప్ కు రాజకీయంగా కలిసొస్తుందా? బెడిసికొడుతుందా?

కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాకర్షక విధానాలతో ముందుకెళుతోంది. కానీ పంజాబ్ లో మంత్రి తొలగింపు, అరెస్ట్ వ్యవహారంతో ఆ పార్టీకి పెద్దగా ఒనగూరేది ఏమీ లేదంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఆ పార్టీ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చినవారితోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కూడా ఉన్నారు. అంటే ఆయా పార్టీల సంస్కృతి కూడా ఇప్పుడు ఆప్ లో ఓ భాగమైందని.. అందుకే పరిస్థితి ఇలా మారిందంటున్నారు.

అవినీతిని సహించబోమని.. అలాంటివారికి తమ పార్టీలో చోటు లేదని ఆప్ వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి ఈ అస్త్రాన్ని ఉపయోగించుకోవచ్చు. కాకపోతే దానిని ఎలా వాడుకుంటుంది అన్నదానిపైనే దానికి వచ్చే మార్కులు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ఇలాంటి పని చేసి చూపించింది. కర్ణాటకలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిగా చేసిన కేఎస్ ఈశ్వరప్ప.. తమ సొంతపార్టీ నేత అయిన సంతోష్ పాటిల్ నుంచి ఓ కాంట్రాక్ట్ విషయంలో దాదాపు 40 శాతం కమిషన్ ను డిమాండ్ చేశారు. దీంతో సంతోష్ ఆత్మహత్య చేసుకోవడం.. దానికి కారణం మంత్రి ఈశ్వరప్పే అని సూసైడ్ లెటర్ రాయడం జరిగిపోయాయి. దీంతో ఆయన మంత్రి పదవి పోయింది. పోలీసులు కూడా ఈశ్వరప్పపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆప్ మంత్రిగా చేసిన విజయ్ సింగ్లా డిమాండ్ చేసింది ఒక శాతం కమిషన్. ఇక్కడ లెక్క కమిషన్ ఎంత అన్నది కాదు.. అవినీతి వ్యవస్థను పూర్తిగా పెకిలించాల్సిన అవసరముంది అని ఈ ఘటనలు రుజువుచేస్తన్నాయన్న సంగతిని రాజకీయ పార్టీలు మర్చిపోకూడదు.

Exit mobile version