Delhi New CM : ఢిల్లీ కొత్త సీఎం ఎవరు ? అనే దానిపై ఇంకొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా దీనిపై ప్రకటన చేయనున్నారు. తొలుత ఇవాళ ఉదయం 10.30 గంటలకు కేజ్రీవాల్ నివాసంలో ఆప్ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. అందులోనే సీఎం అభ్యర్థిని ఎంపిక చేస్తారు. అయితే సాయంత్రం 4.30 గంటలకు రాజీనామా సమర్పించే ముందు, తదుపరి సీఎం ఎవరు అనేది కేజ్రీవాల్ అనౌన్స్ చేయనున్నారు. సోమవారం రోజు ఆమ్ ఆద్మీ పార్టీలో అత్యంత కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఆ మీటింగ్‌లోనూ సీఎం ఎంపికపై చర్చ జరిగినట్లు తెలిసింది. సీఎంగా(Delhi New CM) ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందనే దానిపై అందరు ముఖ్య నేతల సలహాను కేజ్రీవాల్ కోరారు. విడివిడిగానూ ఒక్కో ముఖ్య నేతతో దీనిపై ఆయన చర్చించారని సమాచారం.
Also Read :4 Crore Deaths : 2050 నాటికి 4 కోట్ల మంది బలి.. ఆ మహమ్మారితో ముప్పు : ది లాన్సెట్
ఈ సమావేశం అనంతరం తదుపరి ఢిల్లీ సీఎం ఎవరు అనే దానిపై ఆప్ నేతలు ఎవరూ పెదవి విప్పలేదు. ఢిల్లీ మంత్రులు అతిషి, భరద్వాజ్, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, ఆ పార్టీకి చెందిన దళిత నేతలు రాఖీ బిర్లా, కుల్దీప్ కుమార్‌ల పేర్లను కేజ్రీవాల్ పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ పేరు కూడా పరిశీలనలో ఉందని అంటున్నారు. ఎవరైనా దళిత నాయకుడు లేదా ఎవరూ ఊహించని ఓ నేతకు సీఎంగా ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.
త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని.. వాటిలో ఆప్ గెలిచిన తర్వాతే తాను, మనీశ్ సిసోడియా సీఎం, డిప్యూటీ సీఎంలుగా మళ్లీ బాధ్యతలు చేపడతామని కేజ్రీవాల్ ఇటీవలే ప్రకటించారు. సిసోడియా, కేజ్రీవాల్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని.. తాను సీఎంగా కొనసాగితే, సిసోడియాకు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఆయన రాజీనామా చేశారని పరిశీలకులు అంటున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీలో సిసోడియా పోషించే పాత్ర ఆధారంగా ఆయన భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలనేది కేజ్రీవాల్ నిర్ణయిస్తారని చెబుతున్నారు.