Site icon HashtagU Telugu

Free Aadhaar Update : మరోసారి ఆధార్‌ ఫ్రీ డాక్యుమెంట్ల అప్‌లోడ్‌ గడువు పొడిగింపు

Aadhaar free document upload deadline extended once again

Aadhaar free document upload deadline extended once again

Free Aadhaar Update : ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మరోసారి పొడిగించింది. ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకునేందుకు సంబంధిత డాక్యుమెంట్లను ఉచితంగా అప్లోడ్‌ చేసుకునే గడువును జూన్‌ 14తో ముగించనున్న నేపథ్యంలో, ఈ అవకాశాన్ని మరోసారి పొడిగించింది. ఇప్పుడు ఈ గడువు మరో సంవత్సరం పాటు అంటే 2026 జూన్ 14 వరకు పొడిగించినట్లు ఉడాయ్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా ఎక్స్‌లో ఒక పోస్ట్‌ ద్వారా UIDAI స్పందిస్తూ, ఆధార్ వివరాలను తాజా సమాచారం ప్రకారం ఉంచుకోవడం ఎంతో అవసరం అని పేర్కొంది. ఆధార్ హోల్డర్లు తమ గుర్తింపు రుజువు (Proof of Identity – PoI), చిరునామా రుజువు (Proof of Address – PoA) పత్రాలను మై ఆధార్ పోర్టల్‌ (https://myaadhaar.uidai.gov.in) ద్వారా ఉచితంగా అప్‌లోడ్‌ చేయవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది.

Read Also: Boundary Catches: క్రికెట్‌లో కొత్త రూల్‌.. ఇక‌పై ఇలా క్యాచ్ ప‌డితే నాటౌట్‌!

వివాహం, ఉద్యోగ మార్పులు, ఉన్నత చదువుల కోసం వేరే ప్రాంతాలకు మారడం వంటి కారణాల వల్ల చిరునామా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారికి ఆధార్‌లో కొత్త సమాచారం నమోదు చేసుకోవడం చాలా అవసరం. అంతేకాక, ఆధార్ తీసుకున్న దశకు ఇప్పటి వరకు పదేళ్లు పూర్తయినవారు తప్పనిసరిగా తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడాయ్‌ సూచిస్తోంది. గతంలో ఆధార్‌ డాక్యుమెంట్ల అప్‌డేట్‌కు కేంద్రాల్లో రూ.50 చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ఖర్చు లేకుండానే, ఇంటి నుంచే ఈ ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం కల్పించడం లక్షలాది ఆధార్‌ దారులకు ప్రయోజనకరంగా మారనుంది. ప్రజల అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఉడాయ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి, ఆధార్‌ను అప్‌డేట్ చేయాల్సినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. 2026 జూన్ 14లోగా ఉచితంగా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, ఆధార్‌ను తాజా సమాచారంతో అప్‌డేట్ చేసుకోండి.

ఆన్‌లైన్‌లో ఎలా?

.ఆన్‌లైన్‌లో ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ చేయాలంటే ముందుగా యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ఆధార్‌ నంబర్‌తో లాగిన్‌ కావాలి.
.రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీతో లాగిన్‌ అయిన వెంటనే అప్పటికే ఉన్న మీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
.అందులోని వివరాలన్నీ సరైనవో కాదో చెక్‌ చేసుకోండి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేసేయాలి. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్ట్స్‌పై క్లిక్‌ చేయాలి.
.తర్వాత కనిపించే డ్రాప్‌డౌన్‌ లిస్ట్‌ సాయంతో డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్‌ కాపీలను అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌పై క్లిక్‌ చేయాలి.
.14 అంకెల ‘అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నంబర్‌’ వస్తుంది. దీని ద్వారా అప్‌డేట్‌ స్టేటస్‌ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవచ్చు.

Read Also: Shubhanshu Shukla : జూన్‌ 19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర..ఇస్రో ప్రకటన