Site icon HashtagU Telugu

Indian Spy Sehmat : 1971 వార్‌లో భారత్‌ను గెలిపించిన ‘రా’ ఏజెంట్.. సెహ్మత్ విశేషాలివీ

Indian Spy Sehmat Pakistan Raw

Indian Spy Sehmat : దేశం కోసం, దేశ ప్రయోజనాల, దేశ ప్రజల కోసం గూఢచర్యం చేసే అవకాశం దక్కడం చాలా గొప్ప విషయం. విదేశాల్లో భారత గూఢచారులుగా పనిచేసే వారికి సంబంధించిన ప్రత్యేక విభాగాన్ని ‘రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్’ (రా) అని పిలుస్తారు. దీని పరిధిలో ఉంటూ వివిధ దేశాల్లో భారతదేశం కోసం రహస్య గూఢచారులుగా పనిచేసే వారిని రా ఏజెంట్లు అని పిలుస్తారు. మన దేశానికి చాలా దేశాల్లో రా ఏజెంట్లు ఉన్నారు. అయితే వారు ఎవరు ? అనేది ఎవరికీ తెలియదు. అంత సీక్రెట్‌గా వాళ్లు జీవిస్తారు. ఆయా దేశాల్లోని ప్రజలు, నేతలు, పారిశ్రామికవేత్తలు, మాఫియా గ్యాంగులు, తీవ్రవాద సంస్థలు, సైన్యాలతో రా ఏజెంట్లు కలిసిపోతారు. వాళ్లతో కలిసి ఉంటూనే రహస్య సమాచారాన్ని సేకరించి భారత్‌కు పంపుతుంటారు. ఇదే విధంగా భారత్ కోసం పాకిస్తాన్‌లో గూఢచర్యం చేసింది ఒక మహిళా రా ఏజెంట్. ఆమె అందించిన కీలకమైన సమాచారం వల్ల 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో మన భారతదేశం విజయం సాధించగలిగింది. ఆమె ఎవరు ? పాకిస్తాన్‌లో సాహసోపేతంగా గూఢచర్యం ఎలా చేసింది ? తెలుసుకుందాం..

Also Read :India Vs Pakistan: పాక్‌కు భారత్ భయం.. మాజీ దౌత్యవేత్త సంచలన ట్వీట్‌

నాన్నకు ఇచ్చిన మాట కోసం ‘రా’లోకి..

ఆమె పేరు సెహ్మత్. సెహ్మత్ తండ్రి భారత నిఘా సంస్థ ‘రా’లో అధికారిగా పనిచేసేవారు. ఢిల్లీ యూనివర్సిటీలో సెహ్మత్(Indian Spy Sehmat) చదువుకుంది. సెహ్మత్ తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతూ 1969లో చనిపోయారు. చనిపోయే ముందు సెహ్మత్ దగ్గర తండ్రి ఒక మాట తీసుకున్నారు.  ‘‘నువ్వు దేశానికి సేవ చేయాలి’’ అని సెహ్మత్‌ను ఆమె తండ్రి కోరారు.  ‘‘సరే నాన్న’’ అని తండ్రికి సెహ్మత్‌ మాట ఇచ్చింది. తండ్రికి ఇచ్చిన మాటను నిలుపుకునేందుకే భారత గూఢచార సంస్థ ‘రా’లో సెహ్మత్ చేరింది.  ఆ సమయానికి ఆమె వయసు 20 ఏళ్లే. ఓ వైపు గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుతూ..  మరోవైపు శాస్త్రీయ నృత్యం, వయోలిన్ నేర్చుకుంటున్న సెహ్మత్ రాలో చేరి గూఢచారిగా మారాలని డిసైడ్ అయింది.  అనుకున్నట్టుగానే ‘రా’  విభాగంలో ఆమెకు అవకాశం లభించింది.

Also Read :Kailash Yatra: కైలాస మానస సరోవర యాత్ర.. అర్హతలు, ఖర్చులివీ

పాకిస్తాన్ ఆర్మీ అధికారిని పెళ్లి చేసుకొని.. 

రా విభాగంలో చేరిన సెహ్మత్‌కు నిర్దేశించిన తొలి టార్గెట్.. పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ అధికారి ఇక్బాల్ సయ్యద్. ఆయనను పెళ్లి చేసుకోవాలనే టాస్క్‌ను సెహ్మత్‌కు కేటాయించారు. ఈ ప్లాన్ ప్రకారమే ఆమె పాకిస్తాన్‌కు వెళ్లింది.  ప్లాన్‌ను సెహ్మత్ పక్కాగా  అమలు చేసింది. పాక్ ఆర్మీ అధికారి ఇక్బాల్ సయ్యద్‌ను పెళ్లి చేసుకుంది. పాక్‌లోనే సెటిల్ అయింది.  ఇక్బాల్ సయ్యద్‌ భార్యగా ఉంటూనే పాకిస్తాన్‌లోని సైనికులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆమె రాబట్టింది. అంతేకాదు పాకిస్థాన్ రక్షణ వర్గాలు, నిఘా వర్గాల సమాచారాన్ని కూడగట్టింది.

సెహ్మత్ ఇచ్చిన సమాచారంతో ఏమైందంటే..  

1971లో భారత్ – పాక్ యుద్ధం వేళ.. భారత్‌కు చెందిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ధ్వంసం చేయాలని, సముద్రంలో ముంచేయాలని పాకిస్తాన్ కుట్ర పన్నింది. ఇందుకోసం పీ.ఎన్.ఎస్. ఘాజీ అనే జలాంతర్గామిని పాకిస్తాన్ ఆర్మీ సముద్రంలోకి దింపింది.   ఈ సమాచారాన్ని ముందుగానే భారత్‌కు సెహ్మత్ చేరవేసింది.  దీంతో భారత సైన్యం అప్రమత్తమై పీ.ఎన్.ఎస్. ఘాజీ అనే జలాంతర్గామిని పేల్చేసింది. అందులోని పాకిస్తాన్ సైనికులంతా చనిపోయారు. ఆ తర్వాత కొనసాగిన యుద్ధంలో భారత్ విజయంలో  విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ కీలక పాత్ర పోషించింది. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సెహ్మత్,  గర్భవతిగా ఉన్న టైంలో పాక్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. ఆ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా ఆమె గుర్తింపును భారత ప్రభుత్వం బయటపెట్టలేదు. ఈ వివరాలను రచయిత హరీందర్ సింగ్ సిక్కా తన నవల “కాలింగ్ సెహ్మత్” లో ప్రస్తావించారు.