PM Modi: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం తన నివాసంలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ కీలక సమావేశానికి అధ్యక్షత వహించారు. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో యుద్ధం కారణంగా తలెత్తే సవాళ్లు ముఖ్యంగా ఇంధన భద్రత, ఎరువుల సరఫరా, ద్రవ్యోల్బణంపై లోతుగా చర్చించారు.
LPG నిల్వ దందాలపై కఠిన చర్యలు
ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ దేశీయ వినియోగదారుల కోసం ఎల్‌పిజి (LPG) ధరలను స్థిరంగా ఉంచినట్లు క్యాబినెట్ కార్యదర్శి ప్రధానమంత్రికి వివరించారు. వంటగ్యాస్ సరఫరాను నిర్ధారించడానికి వివిధ దేశాల నుండి దిగుమతులను పెంచుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో పెట్రోలియం ఉత్పత్తుల నల్లబజారు లేదా అక్రమ నిల్వలకు పాల్పడే వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది.
రైతులకు ఎరువులు, విద్యుత్ కోసం ‘బ్యాకప్ ప్లాన్’
ప్రధాని మోదీ ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఖరీఫ్, రబీ సీజన్ల కోసం దేశంలో ఎరువుల కొరత లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. యూరియా ఉత్పత్తి కొనసాగుతోందని, డీఏపీ (DAP) విదేశీ సరఫరా కోసం సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు వేసవిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లకు (7-8 GW) ఉపశమనం కలిగించడం, థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు వ్యూహాన్ని సిద్ధం చేశారు.
హోర్ముజ్ సంక్షోభంపై నిఘా
హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా నౌకల సురక్షిత ప్రయాణంపై కూడా సమావేశంలో చర్చించారు. సివిల్ ఏవియేషన్, షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగాలలో ఎదురయ్యే సంభావ్య అడ్డంకులను ఎదుర్కోవడానికి కూడా వ్యూహాలను రూపొందిస్తున్నారు.
Also Read: సీజ్ ఫైర్ కోరిన ఇరాన్.. అసలు నిజం ఇదే!
పుకార్లపై నియంత్రణ
యుద్ధం కారణంగా వచ్చే పుకార్లు, తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు ప్రజలకు సరైన, ప్రామాణికమైన సమాచారం అందాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. ఆహార వస్తువుల ధరలను పర్యవేక్షించడానికి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. గత నెలలో రిటైల్ ధరలు స్థిరంగా ఉన్నాయని, కూరగాయలు, పండ్ల ధరలపై కూడా రియల్ టైమ్ నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా ఈ ప్రపంచ సంక్షోభం ప్రభావం సామాన్య పౌరులపై పడకుండా అన్ని సాధ్యమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ప్రభావితమైన రంగాలు, పౌరుల సమస్యలను తగ్గించడానికి అన్ని శాఖలు తమ వంతు కృషి చేయాలని ఆయన ఆదేశించారు.
