Site icon HashtagU Telugu

Cat Kumar : బీహార్‌లో విచిత్రమైన ఘటన..పిల్లి పేరుతో నివాస ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు!

A strange incident in Bihar... Application for a residence certificate in the name of a cat!

A strange incident in Bihar... Application for a residence certificate in the name of a cat!

Cat Kumar : బీహార్ రాష్ట్రం మరోసారి విచిత్రమైన ఘటనలతో వార్తల్లో నిలిచింది. ఈసారి కేంద్రంగా మారింది రోహతాస్ జిల్లా. అక్కడ ఒక నకిలీ దరఖాస్తు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నివాస ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసినవారి పేరు చదివితే ఎవరైనా కనీసం రెండుసార్లు చూడాల్సిందే. దరఖాస్తుదారుడి పేరు “క్యాట్ కుమార్”, తండ్రి పేరు “క్యాటీ బాస్”, తల్లి పేరు “కటియా దేవి”. ఈ సమాచారం స్థానిక అధికారులకు అందిన వెంటనే, రోహతాస్ జిల్లా మేజిస్ట్రేట్ ఉదితా సింగ్ స్పందించారు. ఇలాంటి అసంబద్ధమైన, నకిలీ దరఖాస్తులు అధికార వ్యవస్థను అపహాస్యంలోకి నెడుతున్నాయంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నస్రిగంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆమె ఆదేశించారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలే…

ఇది బీహార్‌లో మొదటిసారి జరుగుతోందనుకోవడం పొరపాటే. కొన్ని వారాల క్రితం పట్నాలో ‘డాగ్ బాబు’ అనే కుక్క పేరుతో ఓ దరఖాస్తు వేయడం, ఈస్ట్ చంపారన్ జిల్లాలో ‘సోనాలికా ట్రాక్టర్’ అనే పేరు మీద ట్రాక్టర్ దరఖాస్తు రావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపినవే. ఈ ఘటనలపై విచారణ జరిపిన ప్రభుత్వం, బాధ్యులైన ఇద్దరు అధికారులపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంది. ఈ పరిణామాలు బీహార్ ప్రభుత్వ సేవలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాక, అధికార వ్యవస్థపై సవాలుగా మారుతున్నాయి. ప్రజలకు ఆధునిక సాంకేతికత ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా సేవలు అందించేందుకు తీసుకున్న చర్యలే ఇప్పుడు చిలిపి పనులకు వేదికవుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

నకిలీ దరఖాస్తుల వెనుక ఉద్దేశ్యమేంటి?

ఈ దరఖాస్తుల వెనుక నిజమైన ఉద్దేశ్యం ఏమిటన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మిగిలింది. ఒక్కోసారి ఇది అధికార వ్యవస్థను పరీక్షించాలనే ఉద్దేశ్యంగా ఉండవచ్చు, మరికొన్ని సందర్భాల్లో మోజు కోసమో లేదా అధికారుల వ్యవస్థాపరమైన లోపాలను ఎత్తిచూపించడానికో కావచ్చు. అయినా, ఇది ప్రభుత్వ యంత్రాంగానికి గౌరవహానికరమని, ఉద్యోగుల పనితీరుకు ఆటంకం కలిగించేదిగా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం  క్యాట్ కుమార్ద రఖాస్తు ఘటనపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తప్పుడు సమాచారం ఇవ్వడం ప్రభుత్వ కార్యాచరణకు ఆటంకం కలిగించడం” వంటి ఆరోపణల కింద కేసులు నమోదు చేయబడ్డాయి. ఈ నకిలీ దరఖాస్తుల వెనుక ఉన్న బాధ్యులను గుర్తించి, అరెస్టు చేసి, అవసరమైన అభియోగాలు నమోదు చేయాలని పోలీసు శాఖ సంకల్పించుకుంది.

ప్రభుత్వ స్పందన

బీహార్ ప్రభుత్వం ప్రజలకిచ్చే హక్కుల పరిరక్షణలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నట్టు అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. “బీహార్ రైట్ టు పబ్లిక్ సర్వీస్ యాక్ట్” ప్రకారం, ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి, సరైన ధ్రువీకరణలతోనే తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశారు. అయినప్పటికీ, మానవీయ లోపాలు, సాంకేతిక పరమైన భద్రతా లోపాలు ఇలా నకిలీ దరఖాస్తులకు తలుపు తడుతున్నాయని చెప్పవచ్చు. ఈ ఘటనలు నవ్వు తెప్పించేలా ఉన్నప్పటికీ, అంతర్లీన వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు వేస్తున్నాయి. ప్రజల అవగాహన, అధికారుల అప్రమత్తత, మరియు సాంకేతిక మద్దతు మూడూ కలిసి మాత్రమే ఇలాంటి పరిణామాలను నివారించగలవు. “క్యాట్ కుమార్” కేసు ఈ దిశగా ఒక హెచ్చరికగా మారాలని అభిప్రాయపడుతున్నారు నిపుణులు.

Read Also: Maharashtra : హృదయ విదారక ఘటన..భార్య మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన భర్త