Site icon HashtagU Telugu

S-400 : భారత రక్షణ వ్యవస్థలో కొత్త అధ్యాయం..ఎస్-400 కొనుగోళ్లకు రష్యాతో చర్చలు

A new chapter in India's defense system... Negotiations with Russia for the purchase of S-400

A new chapter in India's defense system... Negotiations with Russia for the purchase of S-400

S-400 : భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఎస్-400 ట్రయంఫ్ సిస్టమ్‌ను అదనంగా కొనుగోలు చేసేందుకు రష్యాతో భారత్ చర్చలు ప్రారంభించింది. ఈ విషయాన్ని రష్యా రక్షణ రంగానికి చెందిన ఒక ఉన్నతాధికారి అధికారికంగా ధృవీకరించారు. ఈ వ్యవస్థల తయారీదారు రోసోబోరోనెక్స్పోర్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న చర్చల గురించి, రష్యా సైనిక-సాంకేతిక సహకార సంస్థ చీఫ్ దిమిత్రి షుగేవ్ స్పష్టం చేశారు. భారతదేశం ఇప్పటికే ఎస్-400 వ్యవస్థలను వినియోగిస్తున్నప్పటికీ, భవిష్యత్తు ముప్పులను దృష్టిలో ఉంచుకుని మరిన్ని యూనిట్లు అవసరమవుతున్నాయని ఆయన చెప్పారు.

చైనా ముప్పు నేపథ్యంగా 2018 ఒప్పందం

2018లో భారత్ మరియు రష్యాల మధ్య జరిగిన 5.5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం ప్రకారం, భారత్ ఐదు ఎస్-400 యూనిట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు మూడు యూనిట్లు భారత్‌కు చేరగా, మిగిలిన రెండు యూనిట్లను 2026, 2027 నాటికి పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నవి అదనపు యూనిట్లకు సంబంధించినవిగా తెలుస్తోంది.

ఆపరేషన్ ‘సిందూర్’లో ఎస్-400 ప్రభావం

2025 మే నెలలో భారత సైన్యం పాకిస్థాన్ పై చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” లో ఎస్-400 వ్యవస్థ కీలకపాత్ర పోషించింది. పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన క్షిపణులను ముందుగానే గుర్తించి, వాటిని గాల్లోనే నాశనం చేయడం ద్వారా భారత గగనతలాన్ని రక్షించింది. ఈ విజయవంతమైన ప్రదర్శన వల్లే, భారత రక్షణ శాఖ అదనపు ఎస్-400 యూనిట్లపై దృష్టి సారించినట్లు సమాచారం.

అమెరికా ఒత్తిళ్లపై భారత్ స్పందనపై రష్యా ప్రశంస

ఈ సందర్భంలో అమెరికా నుంచి వచ్చిన ఒత్తిళ్లకు భారత్ దిగజారకపోవడం పట్ల రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రశంసలు కురిపించారు. రష్యా ఆయుధాలను కొనుగోలు చేయవద్దని అమెరికా పరోక్షంగా సూచించినప్పటికీ, భారత్ స్వతంత్ర నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతుండడం అభినందనీయమని ఆయన అన్నారు.

అత్యధిక ఆయుధ సరఫరాదారుగా రష్యా స్థానం

భారత్ ఇటీవల ఫ్రాన్స్, ఇజ్రాయెల్ లాంటి దేశాలనుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ, రష్యానే ఇప్పటికీ ప్రధాన ఆయుధ సరఫరాదారుగా కొనసాగుతోంది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) ప్రకారం, 2020 నుంచి 2024 మధ్య కాలంలో భారత ఆయుధ దిగుమతుల్లో 36 శాతం వాటా రష్యాకే చెందింది.

భారత్-రష్యా సంబంధాలు: స్థిరమైన భాగస్వామ్యం

రష్యా నుంచి భారత్‌కు అందిన కీలక ఆయుధ వ్యవస్థల్లో బ్రహ్మోస్ క్షిపణులు, సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు, టీ-90 ట్యాంకులు, ఏకే-203 రైఫిళ్ల ఉత్పత్తి లాంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి ద్వారా దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత-రష్యా రక్షణ భాగస్వామ్యం మరింత బలపడుతోంది. ప్రస్తుత ప్రపంచ రాజకీయ స్థితిగతుల నేపథ్యంలో, భారత్ తన రక్షణ వ్యూహాన్ని మరింత పటిష్టం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఎస్-400 లాంటి అధునాతన వ్యవస్థల కొనుగోలు ద్వారా, భారత్ తన గగనతల రక్షణను మరింత సమర్థవంతంగా రూపొందించుకునే దిశగా ప్రయాణిస్తోంది.

Read Also: SSMB29 : పాన్ వరల్డ్ వైడ్ గా సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్న మహేష్ బాబు