Nimisha Priya : యెమెన్‌లో వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు విధించిన మరణశిక్ష అమలుకు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 16న ఆమెకు ఉరిశిక్ష అమలుకాబోతోంది. అయితే, ఈ విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. నిమిష ప్రియ మరణశిక్షను ఆపేందుకు సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించినట్టు సమాచారం. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం దౌత్య మార్గాన్ని ఉపయోగించి నిమిషను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సీనియర్ న్యాయవాది రాజెంత్ బసంత్ నేతృత్వంలో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. తాజాగా, ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణ ఈ నెల 14న జరగనుంది. అయితే 16న ఉరిశిక్ష అమలుకావడంతో మధ్యలో కేవలం రెండు రోజులు మాత్రమే ఉండటంతో తక్షణమే విచారణ చేపట్టాలని బసంత్ వాదించారు.
Read Also: Murder : కవాడిగూడలో దారుణం.. కన్న తండ్రిని హత్య చేసిన కూతురు, సహకరించిన తల్లి
దౌత్య దిశగా చర్చలు సాగేందుకు సమయం తక్కువగా ఉండటం వల్ల ప్రభావం చూపే అవకాశం తక్కువేనని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. అయితే షరియత్ చట్టం ప్రకారం బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తే ఉరిశిక్షను రద్దు చేయవచ్చని రాజెంత్ బసంత్ ధర్మాసనానికి వివరించారు. ఈ విషయమై కేంద్రం తక్షణమే యెమెన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నిమిష ప్రియను కాపాడాలని కోరారు. కాగా, నిమిష ప్రియ, కేరళలోని పాలక్కాడ్ జిల్లా నివాసి. ఆమె నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన అనంతరం 2008లో ఉద్యోగ అవకాశాల కోసం యెమెన్ వెళ్లారు. అక్కడ ఆమె 2011లో వివాహం చేసుకుని స్థిరపడ్డారు. ఆపై వైద్య సేవల రంగంలో ప్రవేశించాలనే ఉద్దేశంతో యెమెన్‌కు చెందిన తలాల్ అదిబ్ మెహదీ అనే వ్యక్తిని వ్యాపార భాగస్వామిగా తీసుకుని, ఇద్దరూ కలిసి “అల్-అమన్ మెడికల్ కౌన్సిల్” అనే క్లినిక్‌ను స్థాపించారు. క్లినిక్ కొంతకాలం విజయవంతంగా నడిచింది. కానీ నిమిష భర్త, కుమార్తె కేరళకు వెళ్లిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. మెహదీ చేతుల మీదుగా నిమిషకు వేధింపులు ప్రారంభమయ్యాయి.
దీంతో ఆమె 2017లో అక్కడినుంచి తప్పించుకోవాలనుకుంది. ఈ సమయంలో మెహదీకి మత్తుమందు కలిపిన పానీయం ఇవ్వాలని ప్రయత్నించింది. అయితే అది అతికొద్ది మోతాదులో కాకుండా అధికంగా ఇవ్వడంతో మెహదీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై అక్కడి పోలీసు దర్యాప్తు జరిపి నిమిషపై హత్యారోపణలు మోపారు. కేసు విచారణ అనంతరం యెమెన్ న్యాయస్థానం ఆమెకు మరణశిక్ష విధించింది. అప్పటి నుంచి ఆమె జైలులో శిక్ష అనుభవిస్తోంది. గత ఏడాది ఆమె తల్లి ప్రేమకుమారి యెమెన్ వెళ్లి బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించి ఆమె కుమార్తెను విడుదల చేయించేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ కేసు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. సుప్రీంకోర్టు జోక్యం వల్ల నిమిష ప్రియకు చివరి నిమిషంలో ఉపశమనం లభించే అవకాశం ఉందా? కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన దౌత్య చర్చలు సాగిస్తే మార్పు సాధ్యమేనా? ఈ నెల 14న జరిగే విచారణ ఈ కేసు తీర్మానంలో కీలకంగా మారబోతోంది. యెమెన్ కోర్టు తీర్పు అమలుకంటే ముందే నిమిష ప్రియ జీవితాన్ని రక్షించాలనే అభ్యర్థనల మధ్య ఈ కేసు దిశ మార్చుకోనుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రలో తప్పక సందర్శించవలసిన 5 పురాతన దేవాలయాలు వాటి ప్రాముఖ్యతలు ఇవే..!