Site icon HashtagU Telugu

UP Polls: ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు అన్ని పార్టీల‌కు జీవ‌న్మ‌ర‌ణ పోరాట‌మే..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌హా ఐదు రాష్ట్రాల్లో మ‌హాసంగ్రామం మొద‌లైంది. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల‌కు, ప్ర‌తిప‌క్షాల‌కు కూడా ఈ ఎన్నిక‌లు అత్యంత కీల‌కంగా మారాయి. ఇప్పుడు మొద‌లైన ఎన్నిక‌ల సీజ‌న్ మ‌రో రెండేళ్ళ పాటు నిరంత‌రాయంగా కొన‌సాగుతుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో బ్ర‌హ్మాండ‌మైన మెజారిటీతో ఐదేళ్ళ‌నాడు అధికారం చేప‌ట్టిన కాషాయ పార్టీకి మ‌రోసారి అంతేస్థాయి మెజారిటీతో విజ‌యం సాధించ‌డం ఎంతో అవ‌స‌రం. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అధికారం పొందిన పార్టీ లేదా కూట‌మి హ‌స్తిన‌లో కూడా జెండా ఎగురేస్తుంద‌న్న‌ది ప‌దే ప‌దే రుజువ‌వుతున్న నిజం. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు పూర్త‌యిన రెండు, మూడు మాసాల‌కే దేశంలో అత్యున్న‌త ప‌ద‌వులైన రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌లు రాబోతున్నాయి. ముఖ్య‌మైన ఈ రెండు ప‌ద‌వుల్లోనూ బీజేపీ నేత‌లే కొన‌సాగుతున్నారు.

ఏ పార్టీని బ్ర‌తిమాలుకోకుండా, దేహీ అన‌కుండా రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో త‌మ మ‌నుష్యుల‌ను గెలిపించుకోవ‌డానికి బీజేపీకి ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రుగుతున్న రాష్ట్రాల్లో అధికారాన్ని మంచి మెజారిటీతో నిలుపుకోవ‌డం అత్యంత అవ‌స‌రం. అదేవిధంగా వ‌చ్చే జులై నాటికి రాజ్య‌స‌భ నుంచి 73 మంది స‌భ్యులు రిటైర్ కాబోతున్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎంత ఎక్కువ మంది ఎమ్యెల్యేలు గెలిస్తే బీజేపీకి అంత ఎక్కువ మందిని తిరిగి రాజ్య‌స‌భ‌కు పంపించుకునే వీలుంటుంది. లేదంటే రాష్ట్రప‌తి ఎన్నిక‌ల మీద కూడా ప్ర‌భావం ప‌డుతుంది. యూపీ ఎన్నిక‌ల్లో గ‌తంలో మాదిరిగా థంపింగ్ మెజారిటీ సాధిస్తేనే రెండేళ్ళ త‌ర్వాత జ‌రిగే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కూడా ఇక్క‌డ అత్య‌ధిక ఎంపీ సీట్లు గెలుచుకుని ఢిల్లీ పీఠంపై మ‌రోసారి కూర్చునే అవ‌కాశం తేలిగ్గా ల‌భిస్తుంది. లేదంటే చిన్నా చిత‌కా పార్టీల‌ను కూడా బ్ర‌తిమిలాడాల్సిన ప‌రిస్థితి బీజేపీకి వ‌స్తుంది.

ఈ ఏడాది చివ‌ర్లో జ‌రిగే గుజ‌రాత్, హిమాచ‌ల్ రాష్ట్రాల‌ ఎన్నిక‌ల్లోనూ, వ‌చ్చే ఏడాది తొలి అర్థ‌భాగంలో వ‌చ్చే రాజ‌స్థాన్ , మ‌ధ్య‌ప్ర‌దేశ్, చ‌త్తీస్ ఘ‌డ్, క‌ర్నాట‌క‌ ఎన్నిక‌ల్లోనూ గ‌ట్టిగా ఫైట్ చేయ‌గ‌లుగుతుంది కాషాయ సేన‌. దేశంలో హిందుత్వ బీజాలు చ‌ల్లిన రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ ఏర్ప‌డి 2025 నాటికి వందేళ్ళు పూర్త‌వుతాయి. బీజేపీకి ఇత‌ర హిందూ సంస్థ‌ల‌కు మాతృ సంస్థ అయిన ఆర్ ఎస్ ఎస్ నూరేళ్ళ పండుగ ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. దేశం మొత్తాన్ని కాషాయ‌మ‌యం చేస్తున్న ఆర్ ఎస్ ఎస్ వందేళ్ళ పండుగ జ‌రుపుకునే స‌మ‌యంలో కేంద్రంలోను, అతి పెద్ద రాష్ట్రంలోనూ బీజేపీ ప్ర‌భుత్వాలు లేక‌పోతే కాషాయ నేత‌ల‌కు త‌ల కొట్టేసినంత ప‌న‌వుతుంది. అందుకే ఇప్పుడు మొద‌లైన ఎన్నిక‌ల మ‌హాసంగ్రామం రెండేళ్ళ‌లో ముగిసేనాటికి కేంద్రంలోను, రాష్ట్రాల్లోనూ ఉన్న అధికారాన్ని మ‌రింత ప‌టిష్టం చేసుకోవ‌డానికి క‌మ‌ల‌నాథులు చేయాల్సిన అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

దేశాన్ని ఏలుతున్న బీజేపీకి ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు ఎంత కీల‌క‌మో, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ కు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే నెహ్రూ కుటుంబ రాష్ట్రమైన యూపీలోనే గ‌త ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీ ఓట‌మి చెందారు. ప్ర‌స్తుతం అక్క‌డ పోటీ బీజేపీ, స‌మాజ్ వాదీ పార్టీల మ‌ద్యే ఉంది. ఇక్క‌డ ఎంత క‌ష్ట‌ప‌డినా కాంగ్రెస్ సాధించేదేమీ లేదు. అయితే పంజాబ్ లో ఉన్న అధికారాన్ని కాపాడుకోలేక‌పోతే రెండోసారి పార్టీ అధ్య‌క్షుడు కావాల‌నుకుంటున్న రాహుల్ గాంధీకి స‌మ‌స్యే. ఇప్ప‌టికే గ్రూప్ 23 పేరుతో కాంగ్రెస్ లోని సీనియ‌ర్లు సోనియా, రాహుల్ నాయ‌క‌త్వం మీద బాణాలు ఎక్కుపెట్టారు. సీనియ‌ర్ల‌ను త‌ట్టుకుని కాంగ్రెస్ పార్టీకి తామే దిక్క‌ని ఇందిరా కుంటుంబం నిరూపించుకోవాలంటే పంజాబ్ లో త‌ప్ప‌నిస‌రిగా అధికారాన్ని నిల‌బెట్టుకోవాలి. పంజాబ్ లో విజ‌యం సాధించ‌డం కాంగ్రెస్ పార్టీ కంటే కూడా గాంధీ, నెహ్రూల కుటుంబానికే చాలా ముఖ్యం. అక్క‌డ ముఖ్య‌మంత్రిని మార్చి బీజేపీకి ఆయుధాన్ని అందించింది కాంగ్రెస్ హైక‌మాండ్. మ‌రోవైపు ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీల‌ను ఊడ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో కూడా క్లీన్ స్వీప్ చేయ‌డానికి రంగంలోకి దిగింది. గతంలో బీజేపీని మాత్ర‌మే ఎదుర్కొని అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ఇప్పుడు పంజాబ్ లో బీజేపీతో పాటు ఆప్ ను కూడా ఎదుర్కొనాలి. ముక్కోణ‌పు పోటీలో చ‌తికిల‌ప‌డుతుందో, లేక అధికారాన్ని నిల‌బెట్టుకుంటుందో చూడాలి.

గ‌త ఎన్నిక‌ల్లో యూపీలో ఒక్క మైనారిటీకి కూడా సీటివ్వ‌కుండా త‌మ‌కు ముస్లింల ఓట్లు అక్క‌ర్లేద‌నే సంకేతాలిచ్చి మూడు వంద‌ల సీట్లు సాధించి అధికారంలోకి వ‌చ్చింది కాషాయ పార్టీ. యోగి ఆధిత్య‌నాధ్ ఐదేళ్ళ పాల‌న‌లో బీసీలు, ఎస్సీలు, మైనారిటీలకు ఏమీ చేయ‌లేద‌నే ఆరోప‌ణ‌ల‌తో ఎన్నిక‌ల ముందు ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీని వీడి అఖిలేష్ నాయ‌క‌త్వంలోని స‌మాజ్ వాదీ పార్టీలో చేరిపోయారు. అదే స‌మ‌యంలో ఎలాగైనా భారీ మెజారిటీతో అధికారం నిలుపుకోవాల‌న్న కాంక్ష‌తో మోడీ స‌ర్కార్ కేంద్ర నిధుల్ని భారీగా యూపీలో గుమ్మ‌రిస్తోంది. భారీ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేసింది. అఖిలేష్ యాద‌వ్ కూడా గ‌త ఓట‌మి నుంచి గుణ‌పాఠాలు నేర్చుకుని ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న బ‌ల‌మైన కోరిక‌తో కాంగ్రెస్ ను ప‌క్క‌న‌పెట్టి అనేక మంది చిన్న చిన్న మిత్రుల‌ను కూడ‌గ‌ట్టుకున్నారు. అదే స‌మ‌యంలో బీఎస్పీ కూడా కొన్ని చిన్న పార్టీల‌తో పొత్తు పెట్టుకుని బ‌రిలోకి దిగింది. ఇక హైద‌రాబాద్ కు చెందిన ఎంఐఎం పార్టీ మైనారిటీల ఓట్లు గంపగుత్త‌గా కొట్టేద్దామ‌ని ప్లాన్ చేసుకుని రెండు చిన్న పార్టీల‌తో పొత్తు పెట్టుకుంది. ఈ విధంగా యూపీలో జ‌రిగే పంచ‌ముఖ పోటీలో కాషాయ సేన గెలుస్తుందా లేక యాద‌వుల పార్టీ విజ‌యం సాధిస్తుందా చూడాలి. ఏదేమైనా ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ నాయ‌క‌త్వానికి అగ్ని ప‌రీక్ష అని చెప్ప‌వ‌చ్చు.

Exit mobile version