MF Husain Paintings : ఎంఎఫ్ హుస్సేన్.. ప్రఖ్యాత చిత్రకారుడు. ఆయన గీసిన పెయింటింగ్స్ అద్భుతంగా, కళాత్మకంగా ఉంటాయి. ఎంఎఫ్ హుస్సేన్ కుంచె నుంచి జాలువారిన రెండు పెయింటింగ్స్‌ను ఢిల్లీ ఆర్ట్ గ్యాలరీ నుంచి సీజ్ చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాహిల్ మోంగా ఆదేశాలు జారీ చేశారు. ఆ పెయింటింగ్స్‌లో హిందూ దేవతలను “అభ్యంతరకరమైన” రీతిలో చిత్రీకరించారంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈమేరకు ఆర్డర్స్ ఇచ్చింది. ఈ ఆదేశాలను కోర్టులో సవాల్ చేసేందుకు ఢిల్లీ ఆర్ట్ గ్యాలరీ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
Also Read :Saif Ali Khans Property : సైఫ్ అలీఖాన్‌కు మరో షాక్.. రూ.15వేల కోట్ల ఆస్తి ప్రభుత్వపరం ?
కేసు వివరాలు..
ఎంఎఫ్ హుస్సేన్(MF Husain Paintings) పెయింటింగ్లపై అభ్యంతరం తెలుపుతూ పిటిషన్ దాఖలు చేసిన వారి పేరు అమితా సచ్‌దేవా. అమిత ఢిల్లీ హైకోర్టులో అడ్వకేట్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘2024 డిసెంబరు 4న నేను ఢిల్లీ ఆర్ట్ గ్యాలరీని సందర్శించాను. అందులో ‘హుస్సేన్ : ది టైమ్ లెస్ మోడర్నిస్ట్’ అనే శీర్షికన ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీని చూశాను. అందులోని పెయింటింగ్‌లు అన్నీ పరిశీలించాను. రెండు పెయింటింగ్‌లలో హిందూ దేవుళ్లు, దేవతలను అభ్యంతరకరంగా చిత్రీకరించడాన్ని గమనించాను’’ అని అమితా సచ్‌దేవా వెల్లడించారు. అందుకే తాను కోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపారు. అటువంటి పెయింటింగ్స్ వల్ల ప్రజల మతపరమైన మనో భావాలు దెబ్బతింటాయని కోర్టుకు అమితా సచ్‌దేవా చెప్పారు. ప్రజల మతపరమైన మనోభావాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానానికి విన్నవించారు. ఆమె వాదనలతో ఏకీభవించిన ఢిల్లీ కోర్టు ఆ రెండు పెయింటింగ్ల సీజ్‌కు ఆదేశాలు ఇచ్చింది.
చనిపోయే వరకు విదేశాల్లోనే..
వాస్తవానికి ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్స్‌పై గతంలోనూ ఇటువంటి వివాదాలు అలుముకున్నాయి. ఆయనకు చెందిన చాలా పెయింటింగ్స్‌లో హిందూ దేవతలను అభ్యంతరకరంగా చూపారు. దీంతో హిందూ సంఘాలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశాయి. ఈ వ్యతిరేకతను తాళలేక ఆయన భారత్ వదిలిపెట్టి వెళ్లిపోయారు. దుబాయ్, లండన్‌లలో జీవించారు. 2011 జూన్ 9న ఎంఎఫ్ హుస్సేన్ చనిపోయారు.