Site icon HashtagU Telugu

New Bill : అవినీతిపరులకు చెక్..ప్రధాని మోడీ మద్దతుతో కొత్త బిల్లు..విపక్షాల నిరసనపై ఘాటు స్పందన

A check on the corrupt.. New bill with the support of Prime Minister Modi.. Strong response to the opposition's protest.

A check on the corrupt.. New bill with the support of Prime Minister Modi.. Strong response to the opposition's protest.

New Bill : బిహార్ రాష్ట్రంలోని గయాలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలపై గట్టి విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు పరిచయం చేసిన కొత్త చట్టం ముఖ్యమంత్రి అయినా, ప్రధాని అయినా అవినీతికి పాల్పడి అరెస్టయినట్లయితే వారి పదవులు కోల్పోయేలా చేసే బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మోడీ తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ బిల్లుపై కాంగ్రెస్‌, ఆర్జేడీ తదితర ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయని మోడీ ఆరోపించారు. వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ఆ పార్టీల నేతలు ఎవరో జైల్లో ఉన్నారు లేదా బెయిల్‌పై బయట ఉన్నారు అంటూ ఎద్దేవా చేశారు.

ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగి 50 గంటలు జైల్లో ఉంటే ఉద్యోగం పోతుంది. అలాంటప్పుడు ఒక ముఖ్యమంత్రి లేదా ప్రధాని నెలరోజుల జైలు శిక్ష అనుభవించినా పదవిలో కొనసాగడం ఎలా న్యాయమైనది? అని ప్రశ్నించారు. అవినీతి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా మోడీ పాత ఉదాహరణలు గుర్తు చేస్తూ కొన్ని సంవత్సరాల క్రితం, జైల్లో ఉండే నేతలు కూడా జైలులో నుంచే ఫైళ్లపై సంతకాలు చేసి, అధికార ఆదేశాలు జారీ చేయడం మనం చూశాం. అటువంటి వ్యవస్థను ప్రోత్సహించడమా ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు.

కొత్త బిల్లోని ముఖ్యాంశాలు ఇవే..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లులో, అవినీతికి పాల్పడి కనీసం అయిదేళ్ల శిక్షకు దోషిగా తేలిన వ్యక్తి, నెల రోజుల పాటు నిర్బంధంలో ఉంటే 31వ రోజు నుంచి అతని పదవిని స్వయంగా రాజీనామా చేయకపోయినా కోల్పోయేలా నిబంధనలు చేర్చారు. ఇది ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులందరికీ వర్తించనుంది. ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన తర్వాత సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించారు. కమిటీ సిఫార్సులు వచ్చిన తర్వాత ఇది చర్చకు వస్తుంది. అయితే ఇప్పటికే విపక్షాలు దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా పరిగణిస్తూ తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

కాగా, ఈ చట్టం ఎవరికీ మినహాయింపు ఇవ్వదు. ప్రధాని అయినా సరే, చట్టానికి లోబడాల్సిందే. అవినీతి మూలాలు తొలగించాలంటే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇకపై క్రిమినల్ చరిత్ర ఉన్న నేతలకు పదవులపై హక్కు ఉండదు అంటూ మోడీ స్పష్టం చేశారు. ప్రధాని వ్యాఖ్యల వెనుక, రాజకీయ స్వచ్ఛతను కోరుకునే ప్రజల ఆకాంక్షలే నిలిచినట్లు కనిపిస్తోంది. అయితే ఇది రాజకీయంగా ఎంతవరకు ప్రభావం చూపుతుందో ఎంతమంది నిజంగా చట్టానికి లోబడతారో గమనించాల్సిన విషయమే.