Site icon HashtagU Telugu

Noida TO NASA : ఆస్టరాయిడ్‌ను గుర్తించిన భారత విద్యార్థి.. నాసా బంపర్ ఆఫర్

Daksh Malik Indian Boy Noida Asteroid Nasa Shiv Nadar School

Noida TO NASA : ఓ భారతీయ విద్యార్థి సత్తా చాటాడు. అతగాడు ఏకంగా ఒక గ్రహ శకలాన్ని (ఆస్టరాయిడ్) గుర్తించాడు. ఈవిషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) కూడా ధ్రువీకరించింది. ఈ ఘనత సాధించిన కుర్రాడి పేరు దక్ష్ మాలిక్. వయసు 14 ఏళ్లు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా వాస్తవ్యుడు. శివనాడార్ స్కూలులో 9వతరగతి చదువుతున్నాడు.  అంగారకుడు  (మార్స్), బృహస్పతి (జూపిటర్) గ్రహాలు ఉండే మార్గంలో చాలా ఆస్టరాయిడ్స్  ఉన్నాయి. వాటిలో నిర్దిష్టంగా ఒక ఆస్టరాయిడ్‌ను దక్ష్ మాలిక్ గుర్తించాడు.

Also Read :Chilkapalli :1947లో స్వాతంత్య్రం.. 2025లో విద్యుత్ వెలుగులు.. చిల్కపల్లిలో సంబురాలు

ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ డిస్కవరీ ప్రాజెక్ట్ (IADP) కోసం ఇద్దరు విద్యార్థులను 2022లో ఎంపిక చేశారు. ఈ జాబితాలో దక్ష్ మాలిక్‌కు కూడా చోటుదక్కింది.  దీనిపై శివనాడార్ స్కూలుకు చెందిన ఆస్ట్రోనమీ క్లబ్‌,  నాసా ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్‌ ఆస్ట్రోనమికల్‌ సెర్చ్‌ కొలాబరేషన్‌(IASC)కు మెయిల్‌ పంపింది. దీంతో  IASC అధ్యయనంలో భాగంగా ఆస్టరాయిడ్‌ను గుర్తించే  ప్రాజెక్టులో పనిచేసేందుకు దక్ష్‌ మలిక్‌, అతడి పలువురు స్నేహితులకు 2023లో అవకాశం లభించింది. దీంతో వారంతా కలిసి ఏడాదిన్నరపాటు అంతరిక్షాన్ని శోధించి 2023లో ఒక గ్రహశకలాన్ని నిర్దిష్టంగా  గుర్తించారు. దానికి ‘2023 OG40’ అని పేరు పెట్టారు. ఈ ఆస్టరాయిడ్‌కు(Noida TO NASA) శాశ్వతంగా పేరు పెట్టే అవకాశాన్ని కూడా దక్ష్ మాలిక్‌కు నాసా కల్పించింది. అతడు ఏ పేరు పెడతాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Also Read :Phone Tapping Case : ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో తొలి బెయిల్‌.. 10 నెలలుగా జైలులో ఉన్న తిరుపతన్నకు ఊరట

నేను నాసా సైంటిస్టులా ఫీలైపోయా : విద్యార్థి దక్ష్ మాలిక్ 

‘‘చిన్నప్పటి నుంచే నాకు అంతరిక్షంపై చాలా ఆసక్తి.  అంతరిక్ష రహస్యాలను తెలుసుకోవాలనే తాపత్రయం నాకుంది. గ్రహాలు, సౌర వ్యవస్థకు సంబంధించిన నేషనల్ జియోగ్రాఫిక్‌ డాక్యుమెంటరీలు చూసేవాడిని. నా చాలా ఏళ్ల కల ఇప్పుడు సాకారమైంది. ఆస్టరాయిడ్‌ను కనుగొనడానికి పని చేస్తున్న క్రమంలో నన్ను నేను నాసాలో పని చేస్తున్న శాస్త్రవేత్తలా  ఊహించుకునేవాడిని. మేం గుర్తించిన కొత్త ఆస్టరాయిడ్‌కు ‘డిస్ట్రాయర్ ఆఫ్ ది వరల్డ్,’ ‘కౌంట్‌డౌన్’ వంటి పేర్లు పెట్టాలని అనుకుంటున్నాను. ఇంకా ఏదీ ఫైనల్ చేయలేదు’’ అని దక్ష్ మాలిక్ చెప్పుకొచ్చాడు.