Site icon HashtagU Telugu

Goa CM Sawant: వలస కార్మికుల వల్లే గోవాలో నేరాలు : సీఎం ప్రమోద్ సావంత్

Goa CM Sawant

New Web Story Copy (65)

Goa CM Sawant: గోవాలో పెరుగుతున్న నేరాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలను దాదాపు 90 శాతం బీహార్, ఉత్తరప్రదేశ్ మరియు ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన కార్మికులే చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా వలస కూలీలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే లేబర్ కార్డును తప్పనిసరిగా పొందాలని సూచించారు.

ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి వలస కూలీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన లేబర్ కార్డును కలిగి ఉండాలన్నారు. ప్రైవేట్, పారిశ్రామిక రంగాలలో పని చేస్తున్న వారి వివరాలు ప్రభుత్వ డేటాలో నమోదు చేస్తుందని అన్నారు. అలాగే సంక్షేమ పథకాలను ఈ రంగానికి విస్తరించడానికి లేబర్ కార్డులను జారీ చేస్తుందని సీఎం చెప్పారు.

గోవాలో నేరాలకు పాల్పడి కొందరు వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు పారిపోతున్నారని, దీంతో వారిపై చర్యలు తీసుకోవడం చాలా కష్టమవుతోందని ప్రమోద్ సావంత్ అన్నారు. గోవాలో అత్యధికంగా 90 శాతం నేరాలకు పాల్పడింది వలస కూలీలే. బీహార్, ఉత్తరప్రదేశ్ లేదా ఇతర ప్రాంతాలకు చెందిన వారేనంటూ సీఎం అభిప్రాయపడ్డారు.

కార్మికులందరికీ కార్డులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వేతర సంస్థలను (ఎన్‌జిఓ) నియమించిందని సావంత్ తెలిపారు. త్వరలో కార్డుల కోసం కూలీల నమోదు సౌకర్యాన్ని ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కూలీలందరికీ కార్డులు జారీ చేసిన తర్వాత డేటాబేస్‌ను యాక్సెస్ చేయడం సులభతరం అవుతుందని చెప్పారు. ఇది కేసులను దర్యాప్తు చేయడానికి మరియు ట్రాక్ చేయడానికి పోలీసులకు సహాయపడుతుందని సావంత్ చెప్పారు.

Read More: WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. మరో ఇద్దరు ఆటగాళ్లకు గాయాలు