Maoists Encounter : ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వం చెప్పిన విధంగానే మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లను ముమ్మరంగా సాగిస్తోంది. తాజాగా ఇవాళ తెల్లవారుజామున బస్తర్ ప్రాంతంలోని దంతెవాడ-బీజాపుర్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , సీఆర్పీఎఫ్ బలగాలు చేపట్టిన జాయింట్ సెర్చ్ ఆపరేషన్‌లో 9 మంది మావోయిస్టులు(Maoists Encounter) మృతిచెందారు. చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. మావోయిస్టుల నుంచి పెద్దమొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ కథనం ప్రకారం.. ‘‘ఇవాళ తెల్లవారుజామున దంతెవాడ-బీజాపుర్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాం. ఈక్రమంలో అడవుల్లో మావోయిస్టులు ఎదురుపడ్డారు. కాసేపు ఇరువర్గాల మధ్య కాల్పులు, ప్రతికాల్పులు జరిగాయి. ఈక్రమంలో తొమ్మిది మంది మావోయిస్టులను మేం మట్టుబెట్టాం. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా దళ సిబ్బంది అందరూ సురక్షితంగానే ఉన్నారు. సంఘటనా స్థలంలో మావోయిస్టుల నుంచి పెద్దమొత్తంలో ఎస్ఎల్‌ఆర్ రైఫిల్స్, 303 రైఫిల్స్, పాయింట్ 315 బోర్ రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నాం. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఆపరేషన్ పూర్తయ్యాక మేం అన్ని వివరాలను విడుదల చేస్తాం’’ అని ఆయన వెల్లడించారు.
Also Read :Shoot On Sight : తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి.. యూపీ సీఎం యోగి సంచలన ఆదేశాలు
గతనెల 29వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్ జిల్లా అబూజ్‌మాడ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఘటనలో ముగ్గురు మహిళా మావోయిస్టులు చనిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో 150 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఈవివరాలను స్వయంగా ఛత్తీస్‌గఢ్ పోలీసు శాఖే విడుదల చేసింది. దీన్నిబట్టి ఆ రాష్ట్రంలో నేటికీ మావోయిస్టుల ప్రాబల్యం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే 2025కల్లా రాష్ట్రంలో మావోయిస్టుల జాడ లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పదేపదే చెబుతున్నారు. అందుకు అనుగుణంగా అక్కడి బీజేపీ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు చర్యలు చేపడుతోంది.