Modi : మోదీకి 80 శాతం ఆమోదం.. మరి విపక్షాల మాటేమిటి?

G20 సమావేశం ముగిసిన తక్షణమే ప్రధాని మోదీ (PM Modi) సార్వత్రిక ఎన్నికల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

  • Written By:
  • Publish Date - August 31, 2023 / 12:25 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Narendra Modi : జి20 శిఖరాగ్ర సమావేశానికి వేదికగా భారత దేశం సకల సన్నాహాలతో సర్వ సన్నద్ధంగా వుంది. ఈ సమావేశం ముగిసిన తక్షణమే ప్రధాని మోదీ సార్వత్రిక ఎన్నికల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే తరుణంలో దేశంలో ప్రధాని మోదీ (PM Modi) పట్ల 80 శాతం భారతీయులు సానుకూలంగా ఉన్నట్లు ఒక సర్వే సంస్థ వెల్లడించిన వార్త దేశమంతా మీడియా హెడ్ లైన్స్ లో ధగధగా మెరిసిపోతోంది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే విపక్షాల కూటమి INDIA , ముంబైలో ఈ రోజు, రేపు భేటీ అవుతోంది. మరి విపక్షాలు ఎలా తాజా సర్వే విషయాన్ని తిప్పి కొడతాయి అన్నది సర్వత్రా ఉత్కంఠకు దారి తీసింది.

ఇప్పటికే పాట్నాలో తొలి సమావేశం నిర్వహించిన ప్రతిపక్షాలు, బెంగళూరులో కొంత తమ ఎజెండాలో ముందుకు కదిలి ప్రగతి సాధించినట్టు కనిపించినా, వారి కలయికలో అడ్డంకులను గుర్తించి తొలగించే పనిలో ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపించడంలేదు. అయితే ఈ ముంబై సమావేశంలో బీజెపీ వ్యతిరేక కూటమికి సంబంధించిన కొన్ని కీలకమైన విషయాల పట్ల నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కూటమి లోగో ఆవిష్కరించడం, కూటమికి ఒక వ్యవస్థీకృత రూపాన్ని ఇవ్వడం, కో ఆర్డినేటర్లను ఎంపిక చేయడం, అలాగే INDIA కన్వీనర్ ని ఎంచుకోవడం అనేవి ఈ సమావేశంలో ప్రధాన అంశాలుగా చెప్తున్నారు.

ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ఈ సారి 28 పార్టీల ప్రతినిధులు పాల్గొంటున్నట్టు చెప్తున్నారు. తొలి రోజు అంటే గురువారం నాడు ఫార్మల్ మీటింగ్ ఉంటుందని, శుక్రవారం నాడు మిగిలిన ఎజెండాలోని అన్ని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. సీట్ల ఒప్పందం లాంటి అనేక విషయాల మీద పార్టీల మధ్య తలెత్తే సమస్యలను, వైరుధ్యాలను పరిష్కరించుకోవడానికి వివిధ కమీటీలను ఏర్పాటు చేస్తారు.

నితీష్ కుమార్, రాహుల్ గాంధి, లాలూప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్ తదితర హేమాహేమీలు ముంబై చేరుకున్నారు. ఎజెండా ఏమైనప్పటికీ రకరకాల భావజాలాలు, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల ఆశలూ ఆకాంక్షలతో ఉన్న ఇన్ని పార్టీలు ఒక్కటై కడకంటూ కొనసాగుతాయా అన్నదే అతి పెద్ద చర్చనీయాంశంగా కనిపిస్తోంది. ఇప్పటికీ బిఎస్పీ నేత మాయావతి ఈ కూటమిలో చేరడానికి సుముఖత ప్రదర్శించలేదు. ఆమె బీజేపీతో చర్చలు కొనసాగిస్తున్న వార్తలు వినవస్తున్నాయి. బీజేపీతో తన సర్దుబాటు వీలుకాకపోతే, INDIA కూటమి తన డిమాండ్లకు తలొగ్గితే అప్పుడు మాయావతి ఈ బృందంలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో పక్క రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఎస్పీ నేత అఖిలేష్ కూడా మధ్యప్రదేశ్ లో పోటీకి దిగుతున్నట్టు వార్తలు వినవస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ కీలకంగా ఉన్న కూటమి ముందుకు ఎలా సాగుగతుందన్నదే ప్రతిపక్షాల ముందున్న పెను సవాలు.

అయితే ప్రతిపక్షాలు మాత్రం ధీమాగా ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి 22 కోట్ల ఓట్లు వచ్చాయని, ప్రతిపక్షాలకు అన్నింటకి కలిపి 23 కోట్ల 40 లక్షల ఓట్లు పోలయ్యాయని, విడివిడిగా పోటీ చేస్తేనే ఇలా వుంటే, కలిసి అంతా పోటీలో దిగితే తమ బలం మరింత పెరుగుతుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. పోతే ప్రధాని అభ్యర్ధి ఎవరన్నది ప్రతిపక్షాలు ఇంకా తేల్చుకోలేదని, ఇంక వారేం మోదీని (Modi) ఎదుర్కోగలరని బీజేపీవారు ఎదురు దాడి చేస్తున్నారు. దీనికి సమాధానంగా విపక్షాలు బీజేపీకి మోదీ తప్ప మరో వికల్పం లేదని, విపక్షాల వద్ద అనేక పత్యామ్నాయాలున్నాయని వాదిస్తున్నాయి. సిలెండర్ల రేటు తగ్గించి మోదీ (Modi) దేశంలోని అక్కచెల్లెళ్ళకు రాఖీ కానుక ఇచ్చారని బీజేపీ వారంటే, తాము ఏకంగా భారత మాత రక్షకులం అని విపక్షాలు అంటున్నాయి.

వాదోపవాదాల మాట ఎలా ఉన్నా ముంబై సమావేశం విపక్షాల ఐక్యతకు ఒక పెద్ద కొలమానం కాగలదని అందరూ ఊహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 12 సోషలిస్టు సంస్ధలు, ఎన్జీవోలతో కూడిన సోషలిస్టు జనతా పరివార్ ఈ విపక్ష కూటమికి మద్దతు తెలుపుతున్నట్టు తాజా వార్త వెలువడింది. కేంద్రంలోని ఫాసిస్టు,కమ్యునల్ ప్రభుత్వాన్ని దింపడానికి ఈ కలయిక అనివార్యం అని జేడీయూ నాయకుడు,మహారాష్ట్ర ఎమ్మెల్సీ కపిల్ పాటిల్ అన్నారు. తమ కూటమికి మహారాష్ట్రలో దాదాపు ఏడు శాతం ఓటింగ్ వుందని తాము కలిస్తే రాష్ట్రంలో విపక్షం బలోపేతమవుతుందని ఆయన వాదన. ఇలా ఒకవైపు విపక్షాల కూటమి రానురాను బలం పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది. అయితే కీలకమైన అంశాలు, సీట్ల షేరింగ్, ప్రధాని అభ్యర్థి విషయాలలో ఎలా ఈ కూటమి ఒక నిర్ణయానికి వచ్చి అది సర్వసమ్మతంగా మార్చి, ముందుకు సాగుతుందో వేచి చూడాలి.

Also Read:  Putin : రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ తప్పు చేస్తాడా..? చేస్తే అంతే సంగతి