Jharkhand Crisis : జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడే దాఖలాలు కనిపిస్తున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను భూకుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పాలిటిక్స్ చకచకా మారుతున్నాయి. హేమంత్ సోరెన్ సీఎంగా ఉన్నంత వరకు నోరు మెదపని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. కొత్త సీఎంగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి దూకుడుగా పావులు కదుపుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
కాంగ్రెస్ పార్టీకి జార్ఖండ్‌లో మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే నలుగురు హస్తం పార్టీ ఎమ్మెల్యేలకు చంపై సోరెన్ మంత్రి పదవులు కట్టబెట్టడంపై ఇప్పుడు దుమారం రేగుతోంది. వారిని మంత్రి పదవుల నుంచి తప్పించాల్సిందే అంటూ దాదాపు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భీష్మించారు. ఒకవేళ ఆ నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల(ఆలంగీర్ ఆలం, రామేశ్వర్ ఓరాన్, బన్నా గుప్తా, బాదల్ పత్రలేఖ్)ను మంత్రి పదవుల నుంచి తప్పించకుంటే.. ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి, జైపూర్‌కు వెళ్తామని వారు అల్టిమేటం ఇచ్చారు. జైపూర్ నగరం రాజస్థాన్‌లో ఉంది. బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌కు వెళ్తామని 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతుండటం జార్ఖండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి(Jharkhand Crisis) అద్దంపడుతోంది. 12 మంది కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలలో 8 మంది శనివారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు.
Also Read : Lioness Sita – Lion Akbar : సింహాల జంట సీత, అక్బర్‌లపై కోర్టుకెక్కిన వీహెచ్‌పీ.. ఎందుకు ?
జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో జేఎంఎంకు 29 మంది, కాంగ్రెస్‌కు 17 మంది, ఆర్జేడీకి ఒకరు ఉన్నారు.అంటే మొత్తం 47 మంది ఎమ్మెల్యేల మద్దతు అధికార జేఎంఎం కూటమికి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 41 మంది సభ్యుల మ్యాజిక్ ఫిగర్ అవసరం. ఒకవేళ ఈ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జైపూర్‌లో క్యాంపు ఏర్పాటు చేసి బీజేపీలోకి జంప్ అయితే జేఎంఎం కూటమి సంఖ్యాబలం 47 నుంచి 35కు(Jharkhand Crisis) తగ్గిపోతుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 41 కంటే ఆరుగురు ఎమ్మెల్యేలు తక్కువగా ఉంటారు. అందుకే ఈవిషయంలో జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. ఆ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుజ్జగించాలని హస్తం పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కోరేందుకు చంపై సోరెన్ నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు.