Ayodhya Ram Mandir : ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అయోధ్య రామాలయ నిర్మాణంతో ముడిపడిన కొత్త అప్‌డేట్స్ బయటికి వచ్చాయి. రామాలయ గర్భ గుడిలో పాలరాతితో చేసిన బంగారు పూత కలిగిన సింహాసనాన్ని రామయ్య కోసం నెలకొల్పనున్నారు. ఈ సింహాసనం 8 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు ఉంటుంది. దీన్ని రాజస్థాన్‌లోని హస్తకళాకారులు తయారు చేస్తున్నారు. డిసెంబర్ 15 నాటికి ఈ సింహాసనం అయోధ్యకు చేరుకుంటుంది. ఆ సమయానికి భవ్య రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిస్థాయిలో రెడీ అవుతుంది. భక్తుల సౌకర్యార్థం ఆలయంలోని మూడు అంతస్తుల్లో పైకప్పులు నిర్మించారు. మందిరం ప్రవేశ ద్వారం వెలుపలి గోడ(పార్కోట) పనులు కూడా చివరి దశలో ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
నవంబర్ 5న అయోధ్య రామాలయంలో నిర్వహించే ‘అక్షత పూజ’ కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ 100 క్వింటాళ్ల బియ్యాన్ని ఆర్డర్ చేసింది. అక్షతల్లో కలిపేందుకు ఒక క్వింటాల్ పసుపుతో పాటు దేశీ నెయ్యికి కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇలా కలిపిన బియ్యాన్ని ఇత్తడి కలశాల్లో నింపి పూజ సమయంలో రాముడి విగ్రహం ఎదుట ఉంచనున్నారు. నవంబర్ 5న అయోధ్యలో జరిగే ‘అక్షత పూజ’కు రావాలంటూ వీహెచ్‌పీ ప్రతినిధులను ట్రస్టు ఆహ్వానించింది. ఆలయ ఓపెనింగ్‌కు సంబంధించి వివిధ రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో రెండు కోట్లకుపైగా కరపత్రాలను ట్రస్ట్ ముద్రించింది. వీటితో పాటు పూజలో వినియోగించిన అక్షతలను విశ్వ హిందూ పరిషత్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులకు(Ayodhya Ram Mandir) పంపిణీ చేస్తారు.
