Site icon HashtagU Telugu

Bomb Threat Emails : వంద స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. రాజధానిలో కలకలం

Bomb Threat Emails

Bomb Threat Emails

Bomb Threat Emails : దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం తెల్లవారుజామున కలకలం రేగింది. దాదాపు వంద స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. నగరంలోని ద్వారక, చాణక్యపురి, మయూర్‌ విహార్‌, వసంత్‌ కుంజ్‌, సాకేత్‌ స్కూళ్లకు తొలుత బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత రాజధానితో పాటు నోయిడాలోని దాదాపు 50కి పైగా పాఠశాలలకు వార్నింగ్ ఈ-మెయిల్స్  వచ్చాయని తెలుస్తోంది. దీంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు.  పోలీసులు, బాంబు స్వ్కాడ్ టీమ్స్ హుటాహుటిన ఆయా స్కూళ్లకు చేరుకొని తనిఖీలు నిర్వహించాయి.  ముందుజాగ్రత్త చర్యగా దాదాపు 60 స్కూళ్లను బంద్ చేయించి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. దీంతో సదరు స్కూళ్లలో ఇప్పుడు జరుగుతున్న వార్షిక పరీక్షలు అకస్మాత్తుగా ఆగిపోయాయి. పాఠశాలల ప్రాంగణాలకు దూరంగా ఉండాలని పరిసర ప్రాంతాల ప్రజలను పోలీసులు ఆదేశించారు. బాంబు స్వ్కాడ్ బృందాలు ముమ్మర తనిఖీలు చేశారు. అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తల్లి దండ్రులు ఆందోళన చెందొద్దని  పోలీసులు ప్రకటించారు. పాఠశాలల పరిసర ప్రాంతాల్లో కూడా ముమ్మర సోదాలు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానిత వస్తువులను పోలీసులు గుర్తించలేకపోయారు.

We’re now on WhatsApp. Click to Join

బాంబు బెదిరింపు మెయిల్స్(Bomb Threat Emails)  ఎక్కడి నుంచి వచ్చాయి ? ఎవరు పంపారు ? అనే సమాచారాన్ని తెలుసుకునే పనిలో  ఢిల్లీ పోలీసు విభాగం ఉంది. ఈ-మెయిల్ ఐపీ అడ్రస్‌లను బట్టి విదేశాల నుంచి దీన్ని పంపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒకే వ్యక్తి నుంచి ఈ బెదిరింపులు వచ్చి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. బాంబు బెదిరింపు వచ్చిన స్కూళ్ల జాబితాలో.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్(ద్వారక), మదర్ మేరీ స్కూల్(మయూర్ విహార్), సంస్కృతి స్కూల్(చాణక్య పురి) కూడా ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఢిల్లీలోని పలు స్కూళ్లకు ఇలాంటి బాంబు బెదిరింపులే వచ్చాయి. పోలీసులు తనిఖీలు చేయగా ఆయా స్కూళ్లలో పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అది నకిలీ బెదిరింపేనని వెల్లడైంది.

Also Read :Godrej Family : 127 ఏళ్ల చరిత్ర కలిగిన ‘గోద్రెజ్’‌లో చీలిక.. ఎవరెవరికి ఏయే వ్యాపారం ?

తల్లిదండ్రులు భయపడొద్దు: విద్యాశాఖ మంత్రి అతిషి

‘‘తల్లి దండ్రులు భయపడొద్దు. బాంబు బెదిరింపులు వచ్చిన పాఠశాలల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏ పాఠశాలలోనూ ఏమీ దొరకలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నాం. ఢిల్లీలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు’’ అని పేర్కొంటూ ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు.