AAP vs BJP : ఒక్కొక్కరికి రూ.25 కోట్లు.. మా ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్ర : కేజ్రీవాల్

AAP vs BJP : బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు.

  • Written By:
  • Updated On - January 27, 2024 / 01:25 PM IST

AAP vs BJP : బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలోని తన సర్కారును అస్థిరపరిచేందుకు బీజేపీ పథక రచన చేసిందని ఆయన పేర్కొన్నారు. ఒక్కొక్కరికి రూ.25 కోట్లు చొప్పున ఇస్తామని ఏడుగురు ఆప్‌ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి  కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నించిందని మండిపడ్డారు. ‘‘నన్ను త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పి మా ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు బెదిరిస్తున్నారు. డబ్బు ఇస్తామని చెప్పి ఆప్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్నారు. ఇప్పటికే 21 మంది ఆప్‌ ఎమ్మెల్యేలతో చర్చలు పూర్తయ్యాయని బీజేపీ నేతలు మా వాళ్లతో చెబుతున్నారట. మొత్తం మీద మా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్లాన్‌ను బీజేపీ అమలు చేస్తోంది’’ అని  కేజ్రీవాల్ తెలిపారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ (ఎక్స్)లో ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

మద్యం కుంభకోణంలో తప్పుడు ఆరోపణలతో తనను వేధిస్తున్నది కూడా ఢిల్లీ ప్రభుత్వం కూల్చడానికేనని ఆప్ చీఫ్ చెప్పారు.  లిక్కర్ స్కాంలో ఈడీ తనను అరెస్టు చేయబోయేది దర్యాప్తు కోసం కాదని.. ముమ్మాటికీ సర్కారును కూల్చడానికేనని ఆరోపించారు. గత తొమ్మిదేళ్లుగా ఢిల్లీ సర్కారును కూల్చేందుకు ఎన్ని  ప్రయత్నాలు చేసినా బీజేపీ సక్సెస్ కాలేకపోయిందన్నారు. ఆప్ ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఉన్నారని..  దేవుడు, ప్రజలే తమకు శ్రీరామరక్షగా ఉంటారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఆప్ సర్కారు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కేంద్రంలోని బీజేపీ సర్కారు(AAP vs BJP) ఓర్వలేకపోతోందని విమర్శించారు.

Also Read :Shubh Muhurat : ఫిబ్రవరిలో శుభకార్యాలు, కొత్త పనులకు శుభవేళలివే..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటికే పలుమార్లు నోటీసులను పంపింది. ఈ విచారణలో భాగంగానే ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని ఆప్ నేతలు ఇప్పటికే అనేకసార్లు ఆందోళన వ్యక్తంచేశారు. దర్యాప్తు సంస్థ పంపే ఎలాంటి  ప్రశ్నావళికైనా సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉన్నట్లు చెప్తున్న కేజ్రీవాల్‌.. ఈడీ విచారణకు మాత్రం హాజరుకావడం లేదు. ఈ కేసులో తనను విచారించడానికి గల నిజమైన ఉద్దేశాన్ని తెలపాలంటూ ఇప్పటికే పలుమార్లు ఈడీకి లేఖలు పంపారు.

తృణమూల్‌ బాటలోనే  ఆప్

తృణమూల్‌ కాంగ్రెస్‌ బాటలోనే  ఆప్ కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై  ప్రకటన విడుదల చేసింది.  పంజాబ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఇటీవల ప్రకటించింది. కాంగ్రెస్‌తో సీట్ల ఒప్పందం లేదని, లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని  టీఎంసీ  అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆప్‌ ప్రకటన కూడా వెలువడటం గమనార్హం. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు 40 మంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేశామని ఆప్‌ తెలిపింది. అభ్యర్థులను ఖరారు చేయడానికి ముందు రాష్ట్రంలో సర్వే చేపడుతున్నామని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ వెల్లడించారు.